కొత్త రాష్ట్రపతి ఎవరు? | This is the process for electing new presidential by election | Sakshi
Sakshi News home page

కొత్త రాష్ట్రపతి ఎవరు?

Published Sun, May 7 2017 9:40 AM | Last Updated on Tue, Aug 14 2018 9:06 PM

కొత్త రాష్ట్రపతి ఎవరు? - Sakshi

కొత్త రాష్ట్రపతి ఎవరు?

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
భారత రాష్ట్రపతి పదిహేనో ఎన్నికల్లో గెలుపు కేంద్రంలో పాలక కూటమి ఎన్డీఏకు నాయకత్వం వహించే బీజేపీదేననే అభిప్రాయం బలంగా ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లయిన  ఎంపీలు, ఎమ్మెల్యేల్లో వివిధ పార్టీలు, కూటములకున్న బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీఏకు బయటి పార్టీల మద్దతు అవసరమౌతుంది. దేశాధినేత పదవికి అయిదేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో గెలుపునకు 5,47,761 విలువగల ఓట్లు అవసరంకాగా, ప్రస్తుతం బీజేపీ దాని భాగస్వామ్య మిత్రపక్షాలు ఎన్డీఏ అభ్యర్థికే ఓటేస్తే ఇంకా 20,390 విలువగల  ఓట్ల అవసరం ఉంటుంది. అంటే ప్రస్తుతం తటస్థుల జాబితాలో ఉన్న మూడు రాష్ట్రాల్లోని(తమిళనాడు, ఒడిశా, తెలంగాణ) పాలక పార్టీలు ఏఐఏడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్‌లలో ఏదో ఒక పార్టీ మద్దతుతోనే బీజేపీ అభ్యర్థి గెలవాల్సి ఉంటుంది.

గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రాష్ట్రపతి పన్నెండో ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నా బీజేపీ నేతృత్వంలోని పాలకకూటమి, తెలుగుదేశం వంటి మిత్రపక్షంతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, ఎస్పీ, ఆర్జేడీ వంటి సెక్యులర్‌ ఉత్తరాది ప్రాంతీయపక్షాల మద్దతు కారణంగా ఈ  పక్షాల ఉమ్మడి అభ్యర్థి ఏపీజే అబ్దుల్‌ కలాం వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1997లో జరిగిన పదకొండో ఎన్నికల సమయంలో కూడా పాలక కూటమి యునైటెడ్‌ ఫ్రంట్‌కు మెజారిటీ లేదు.

బయటి నుంచి  కాంగ్రెస్, వామపక్షాలు ఇచ్చిన మద్దతుతో ఫ్రంట్‌ ప్రభుత్వం నడిచింది. దీంతో కాంగ్రెస్‌ ప్రతిపాదించిన తొలి దళిత రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ అభ్యర్థిత్వానికి సహజంగానే యూఎఫ్‌ మద్దతివ్వగా, రెండో వైపు నుంచి కేంద్ర సర్కారు సమర్ధిస్తున్న వామపక్షాలు, తొలి దళిత  రాష్ట్రపతిని చూడాలనే కారణంపై బీజేపీ, దాని మిత్రపక్షాలు మద్దతు పలికాయి. దీంతో శివసేన మద్దతుతో పోటీకి దిగిన మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీఎన్‌ శేషన్‌ను నారాయణన్‌ అత్యంత భారీ మెజారిటీతో ఓడించి ఉప రాష్ట్రపతి పదవి నుంచి రాష్ట్రపతి పదవికి ఎదిగిన చివరి నేతగా రికార్డుకెక్కారు.

పోటీ తప్పదా?
రెండు నెలల్లో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉండగా, పాలక, ప్రతిపక్ష కూటములైన ఎన్డీఏ, యూపీఏ, వామపక్షాలు, బీజేపీని వ్యతిరేకించే జనతా పరివార్‌ పక్షాలైన జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి ప్రాంతీయపార్టీల మధ్య అభ్యర్థి విషయమై  ఏకాభిప్రాయసాధనకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. అయితే మరోపక్క ఎన్డీఏ వ్యతిరేక ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇటీవల దివంగత సోషలిస్ట్‌ నేత మధు లిమాయే 95 జయంతి సందర్భంగా కలిసిన ప్రతిపక్ష నేతలు రా ష్ట్రపతి ఎన్నికల గురించి మాట్లాడుకున్నారని వార్తలొచ్చాయి.

ఈ విషయంపై చర్చిండానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరలో ప్రతిపక్ష నేతల సమావేశం ఏర్పాటుచేస్తున్నారని తెలుస్తోంది. ఎన్డీఏ తరఫున ఈ పదవికి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా  మహాజన్, మణిపూర్‌ గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా, జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపదీ ముర్మూ పేర్లు వినిపిస్తున్నాయి. ఒడిశాకు  చెందిన ద్రౌపది ఆదివాసీ మహిళ. ఇంతకు ముందు ఎస్సీ వర్గానికి చెందిన కేంద్ర సామాజిక న్యాయశాఖా మంత్రి తావర్‌చంద్‌  గెహ్లాట్‌(మధ్యప్రదేశ్‌)పేరు మార్మోగింది.

ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరు?
రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, వామపక్షాలు, జనతా పరివార్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎవరవుతారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. జేడీయూ సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌తోపాటు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌లో ఒకరు పోటీచేయవచ్చిని అం టున్నారు. పశ్చిమబెంగాల్‌ పాలకపక్షం తృణమూల్‌ మాత్రం ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీనే నిలబెట్టాలని కోరుకుంటోంది. పార్టీ అధ్యక్ష పదవి కోల్పోయిన సమాజ్‌వాదీ పార్టీ స్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ కూడా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

1969తో పోలిక సబబేనా?
1967 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తొలి ముస్లిం రాష్ట్రపతిగా చరిత్రకెక్కిన జాకిర్‌ హుస్సేన్‌ 1969లో మరణించాక జరిగిన అయిదో ఎన్నికల్లో తొలిసారి నిజమైన త్రిముఖపోటీ జరిగింది. కాంగ్రెస్‌ అధికార అభ్యర్థి నీలం సంజీవరెడ్డి, ప్రతిపక్షాల ఉమ్మడి  అభ్యర్థి చింతామణ్‌ డి. దేశ్‌ముఖ్‌తోపాటు ప్రధాని ఇందిర పరోక్ష, ప్రత్యక్ష మద్దతుతో ఇండిపెండెండ్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన అప్పటి ఉపరాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి రెండో లెక్కింపులో విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఇలా హోరాహోరీగా రాష్ట్రపతి ఎన్నికలు జరగడం ఇప్పటి వరకూ ఇదే మొదటిసారి, చివరిసారి అనొచ్చు. రేపు జూలైలో జరిగే ఎన్నికలు కూడా 1969లో మాదిరిగా చివరి వరకూ ఉత్కంఠభరితంగా ఉంటాయని కొందరు పరిశీలకులు అంచనావేస్తున్నారు.

ఎలొక్టరల్ కాలేజీ
ఎవరెవరు ఓటర్లు..?: భారత రాష్ట్రపతిని ఎలొక్టరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. అందులో ఎన్నికైన లోక్సభ సభ్యులు (543 మంది), ఎన్నికైన రాజ్యసభ సభ్యులు (233 మంది), ఎన్నికైన రాష్ట్ర శాసనసభల -ఢిల్లీ, పుదుచ్చేరిలతో సహా- సభ్యులు (4,120 మంది) ఉంటారు. నామినేటెడ్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. ఎంపీల ఓటు విలువ ఒకే రకంగా ఉంటుంది. కానీ ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతుంది.  మొత్తంగా ఎలొక్టరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు సమాన వెయిటీజీ – చెరో 50 శాతం – ఉంటుంది.

ఓటింగ్ ఎలా..?: ఓటింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ప్రజాప్రతినిధులెవరూ పార్టీ విప్కు కట్టుబడాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తన ప్రాధాన్యతా క్రమంలో ఓటరు ఓటు వేస్తారు. ఆయా అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1, 2, 3, ... ఇలా సంఖ్యలు రాస్తారు. ఓటరు ఓటు చెల్లాలంటే మొదటి ప్రాధాన్యతను నమోదు చేయడం తప్పనిసరి. ఇతర ప్రాధాన్యతలను నమోదు చేయాలా వద్దా అన్నది ఆ ఓటరు అభీష్టం.

ఓట్ల లెక్కింపు ఎలా..?: ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే మొత్తం ఓట్లలో 50 శాతం + 1 తొలి ప్రాధాన్యత ఓట్లు పొందాలి. దీనిని కోటా అని వ్యవహరిస్తారు. ఏ అభ్యర్థికీ ఈ కోటా రానట్లయితే.. మొదటి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువగా వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి లభించిన మొదటి ప్రాధాన్యత ఓట్లను.. ఆయా ఓట్లలో నమోదైన రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం మిగిలిన అభ్యర్థులకు పంచుతారు. ఒక అభ్యర్థికి అవసరమైన కోటా లభించే వరకూ.. ఇలా తక్కువ ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి, సదరు ఓట్లను రెండో ప్రాధాన్యత ప్రకారం పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అప్పటికీ ఏ అభ్యర్థికీ అవసరమైన కోటా లభించని పక్షంలో.. చివరికి పోటీలో మిగిలిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.

ఓట్లకు విలువ కట్టేది ఇలా..: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలొక్టరల్ కాలేజీ ఓట్ల లెక్కింపుకు ఒక ముఖ్యమైన సూత్రం ఉంటుంది. ఎంపీల ఓట్లకు ఒక విలువ, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువలు ఉంటాయి. దేశాధినేత.. దేశ ప్రజలందరికీ దామాషా పద్ధతి ప్రకారం ప్రాతినిధ్యం వహించేలా చూసేందుకు, కేంద్ర, రాష్ట్రాలకు సమాన ఓటు హక్కు ఉండేలా చేసేందుకు ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు.

ఎలొక్టరల్ కాలేజీ సభ్యుల ఓట్ల విలువ ఈ కింది పద్ధతిలో జరుగుతుంది:



రాష్ట్రాలు, వాటి శాసనసభ సభ్యుల సంఖ్య, ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ, ఆ రాష్ట్రపు మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ వివరాలివీ...



ఎవరెవరు ఎటువైపు?
ఎన్డీఏ: బీజేపీ, టీడీపీ, ఎస్హెచ్ఎస్, ఎల్ఐఎస్పీ, ఎస్ఏడీ, ఆర్ఎల్ఎస్పీ, ఏడీ, ఏఐఎన్ఆర్సీ, జేకేపీడీపీ, ఎన్పీఎఫ్, ఎన్పీపీ, పీఎంకే, ఎస్డీఎఫ్, ఎస్డబ్ల్యూపీ
యూపీఏ: కాంగ్రెస్, ఐయూఎంల్, ఆర్ఎస్పీ, కేసీ(ఎం)

బీజేపీ వ్యతిరేకం: ఏఐటీసీ, సీపీఎం, వైఎస్ఆర్సీపీ, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్, ఐఎన్ఎల్డీ, జేడీఎస్, జేడీయూ, జేఎంఎం, ఏఐఎంఐఎం, సీపీఐ, జేకేఎన్సీ
తటస్థులు: అన్నా డీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్, స్వతంత్రులు

లోక్‌ సభలో బలాబలాలివీ..: లోక్‌ సభలో 543 స్థానాలున్నాయి. అందులో ప్రస్తుతం అనంత్ నాగ్‌, గుర్దాస్ పూర్‌ నియోజవర్గాల సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ 336 సీట్లతో లోక్‌ సభలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి 49 సీట్లున్నాయి. ఇక బీజేపీ వ్యతిరేక పార్టీలకు 85 సీట్లు ఉండగా.. మిగతా 71 మంది తటస్థంగా ఉన్నారు. ఈ లెక్కన చూస్తే.. లోక్‌ సభలో 2,37,888 ఓట్ల (62 శాతానికి పైగా) విలువతో ఎన్డీఏ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.

లోక్‌ సభలో ఎలొక్టరల్ ఓట్ల బలాబలాలు (ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 చొప్పున) ఇలా ఉంటాయి...



రాజ్యసభలో బలాబలాలిలా..: రాజ్యసభలో ప్రస్తుతం 243 మంది సభ్యులున్నారు. అందులో 12 మంది నామినేటెడ్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. మిగిలిన 231 మంది సభ్యుల్లో.. ఎన్డీఏకి 70 మంది, యూపీఏకి 65 మంది, బీజేపీ వ్యతిరేక పార్టీలకు 67 మంది, తటస్థులకు 29 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. అంటే పెద్దల సభలో అధికార ఎన్డీఏ అతి పెద్ద పార్టీ అయినప్పటికీ.. దాని ప్రత్యర్థులు, వ్యతిరేకుల బలం ఎక్కువగా ఉంది.

రాజ్యసభలో ఎలొక్టరల్ ఓట్ల బలాబలాలు (ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 చొప్పున) ఇలా ఉంటాయి...


పార్లమెంటులో ఆధిక్యం ఎన్డీఏదే..: అధికార ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో మెజారిటీ లభించకున్నా.. లోక్సభలో తనకున్న బలంతో దానిని పూరించుకుంటోంది. మొత్తంగా పార్లమెంటు ఎలక్టర్లలో 52 శాతానికి పైగా ఓట్ల విలువతో ఆధిక్యంలో ఉంది.



శాసనసభల్లో బలాబలాలిలా..: పార్లమెంటు సభ్యుల తరహాలో శాసనసభ సభ్యుల ఓట్లు విలువ ఒకే రకంగా ఉండదు. రాష్ట్రాల జన సంఖ్య ఆధారంగా ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఉంటుంది. మొత్తం మీద సగటున ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 134గా లెక్కగట్టవచ్చు. ఢిల్లీ, పుదుచ్చేరిలతో సహా మొత్తం 31 రాష్ట్రాల్లో 4,120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతమున్న 416 సట్లలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి అత్యధికంగా 1,804 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి 811 మంది, బీజేపీ వ్యతిరేకులకు 1,063 మంది, తటస్థులకు 438 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే ఓట్లలో కూడా ఎన్డీఏ దాదాపు 44 శాతం ఎమ్మెల్యే ఎలొక్టరల్ కాలేజీ ఓట్లతో ముందు వరుసలో ఉంది. ఇక యూపీఏ ఎమ్మెల్యేల ఓట్ల విలువ, బీజేపీ వ్యతిరేక పార్టీల ఎమ్మెల్యేల ఓట్ల విలువ కలిపితే.. ఇక్కడ ఎన్డీఏ కన్నా స్వల్పంగా ఎక్కువగా ఉంది.

ఎలొక్టరల్ కాలేజీ ఎమ్మెల్యేల్లో బలాబలాలు ఇలా ఉన్నాయి...


మొత్తం ఎలొక్టరల్ కాలేజీలో బలాబలాలివీ..: మొత్తం ఎలొక్టరల్ కాలేజీ ఓట్లలో ఎన్డీఏ ముందంజలో ఉంది. మొత్తం సుమారు 11 లక్షల ఓట్లలో 5.27 లక్షల ఓట్లు ఆ కూటమికి ఇప్పటికే ఉన్నాయి. ప్రతిపక్ష యూపీఏ కేవలం 1.74 లక్షల ఓట్లతో సుదూరంలో ఉంది. దానికి బీజేపీ వ్యతిరేక పార్టీల ఓట్లు 2.6 లక్షలు కలిపినా కూడా.. ఎన్డీఏ కన్నా ఇంకా సుమారు లక్ష ఓట్లు వెనుకబడే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తటస్థంగా ఉన్న అన్నా డీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ, స్వతంత్రుల పాత్ర కీలకమవుతుంది.

లోక్‌ సభ, రాజ్యసభ, శాసనసభల్లో కలిపి ఏ కూటమికి ఎంత బలం ఉందంటే...


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement