40 ఏళ్లలో ఇదే రికార్డు!
యూపీలో 312 స్థానాలతో బీజేపీ విజయం
⇒ 1977లో 352 స్థానాలు సాధించిన జనతా పార్టీ
⇒ ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ల చరిత్రలో అతిచెత్త ప్రదర్శన
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో గత 40 ఏళ్లలో ఎవరూ సాధించని రికార్డుని బీజేపీ సొంతం చేసుకుంది. మొత్తం 403 స్థానాల కుగాను 312 సీట్లను (77.4%) తన ఖాతాలో వేసుకుని ప్రభంజనం సృష్టించిం ది. 1977 తరువాయి ఒక పార్టీ ఇన్ని స్థానాలు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. అలాగే 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఓట్ల శాతాన్ని 25 నుంచి 39.7 శాతానికి పెంచుకుంది. ఎమర్జెన్సీ అనంతరం 1977 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ మొత్తం 425 అసెంబ్లీ స్థానాలకు 352(82.8 శాతం) సీట్లతో కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. 47.8 శాతం ఓట్లను సాధించి రికార్డు సృష్టించింది.
ఇక 1980లో ప్రస్తుతం బీజేపీ సాధించిన స్థాయిలో కాంగ్రెస్ మంచి ఫలితాలు దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో మొత్తం 425 స్థానాలకు గాను కాంగ్రెస్ 309(72.7 శాతం) స్థానాలు గెలుపొంది.. 39.6 శాతం ఓట్లు గెలుచుకుంది. కాగా ఆ ఎన్నికల్లో 10.8 శాతం ఓట్లతో బీజేపీ 11 స్థానాలకే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అలాంటి ప్రదర్శననే కనపరుస్తూ.. 6.2 శాతం ఓట్లతో కాంగ్రెస్ 7 స్థానాలతో సరిపెట్టుకుంది. మరోవైపు 2014 పార్లమెంట్ ఎన్నికల నాటి అద్భుత ప్రదర్శనను బీజేపీ మళ్లీ కనపర్చింది. ఆ ఎన్నికల్లో 42.7 శాతం ఓట్లతో మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గాను 73(90 శాతం కంటే అధికం) సీట్లు దక్కించుకుంది.
1993 అనంతరం...
ప్రస్తుత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు 20 శాతానికి మించి ఓటు బ్యాంకు గెలుచుకున్నా సీట్లు సాధించడంలో విఫలమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ 21.8, బీఎస్పీ 22.2 శాతం ఓట్లు సాధించగా, 2012లో ఎస్పీ 29, బీఎస్పీ 26 శాతం ఓట్లను గెలుపొందాయి. 1993 నుంచి ఎస్పీ, బీఎస్పీల ఓట్ల శాతం క్రమంగా పెరగ్గా... జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతం మాత్రం తగ్గింది. 2017కి వచ్చేసరికల్లా పార్టీ చరిత్రలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన కనపర్చగా, 1977 అనంతరం అతి తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ తీవ్రంగా నిరాశపర్చింది. ఆవిర్భా వం అనంతరం ఎస్పీ, బీఎస్పీల అతిచెత్త ప్రదర్శన కూడా ఇదే కావడం గమనార్హం.
బీజేపీ ఓట్ల సునామీ: నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల శాతం