న్యూఢిల్లీ: పార్లమెంటులో ఉగ్రవాదం చర్చ జరగకపోవడంపై కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఒక టెర్రరిస్టు ఉరశిక్షపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహించారు. ఉగ్రవాదంపై ముక్తకంఠంతో పోరాడాల్సి ఉండగా అందుకు భిన్నంగా ప్రతిపక్షాలు వ్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ గురుదాస్ పూర్ ఉగ్రవాదదాడిని రాజకీయం చేయడానికి చూస్తోందని ఆర్థిక మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
ఉగ్రవాదంపై చర్చకు ఎందుకు నిరోధిస్తున్నారో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జాతికి వివరణ ఇవ్వాలని అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై చర్చించడానికి ఎందుకు అంగీకరించడం లేదో చెప్పాలన్నారు. మెమన్ ను ఉరితీయడం ద్వారా దేశం రెండుగా చీలిపోయిందనే భావన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
గురువారం రాజ్యసభలో గురుదాస్ ఘటనపై హోమంత్రి రాజ్నాధ్ సింగ్ వివరణ ఇస్తుండగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ అందోళనకు దిగాయి. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభలో మంత్రి వివరణ పూర్తి కాకండానే రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి ఆరోపణలు గుప్పించారు.