
మిగతా జీవితం మహారాణిగా బతికేస్తా: జయ లేఖ
చెన్నై: రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే కాదు.. నటిగా ఉన్నప్పటి నుంచే జయలలిత ప్రతి విషయంలో చాలా స్పష్టతను కొనసాగించే వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడేతత్వం, విమర్శలకు కూడా ఓపికగా సమాధానాలు ఇచ్చే తీరు, అవమనాలను సైతం చిరునవ్వుతో స్వీకరించి పోగొట్టుకున్న చోట రాబట్టుకోవాలని తపించే తత్వం ఆమెకు చిన్నప్పటి నుంచే ఓ జీవన చర్యగా అలవాటైనట్లు తెలుస్తోంది. అందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణగా చెప్పవచ్చు.
అది 1980 జూన్ 10.. జయ స్వహస్తాలతో ఖాస్ బాత్ అనే మేగజిన్ ఎడిటర్ పియోస్ జీకి ఓ లేఖ రాశారు. అంతకుముందు అదే ఏడాది మే 25న జయ గురించి విమర్శిస్తూ ఆ మేగజిన్‌లో ప్రచురించడమే ఆమె ఈ లేఖ రాయడానికి కారణం. జయ ఇక సినిమాల్లోకి రావడం కష్టంగా మారిందని, ఆమె తిరిగి తెరపై కనిపించే అవకాశాలు మందగించినట్లేనని, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆమె తెగ పోరాడుతున్నారంటూ ఖాస్ బాత్ ప్రచురించింది. ఇది చూసిన జయ వెంటనే లేఖ రాశారు. ఆ లేఖలో ఏం రాశారంటే..
‘ప్రియమైన పియోస్ జీ,
మీ ఖాస్ బాత్ ఆదివారం సంచిక(మే 25, 1980)లో నాపై ఎన్నో ప్రశంసలు కురిపించారు. ముందుగా అందుకు మీకు ధన్యవాదాలు. నేను తిరిగి చిత్ర రంగంలోకి అడుగుపెట్టలేక ఇబ్బంది పడుతున్నానంటూ అందులో పేర్కొన్నారు. దానిపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు అసలు ఇలాంటి సమాచారం ఎక్కడి నుంచి అందిందో, మీకు నాపై ఇలాంటి అభిప్రాయం ఎలా వచ్చిందో అర్ధం చేసుకోలేకపోతున్నాను.
నిజానికి నేను ఎన్నో గొప్పగొప్ప అవకాశాలు వదిలేశాను. మీకు తెలియదు కావచ్చు. ప్రముఖ నిర్మాత బాలాజీ నన్ను బిల్లా సినిమా కోసం సంప్రదించారు. ఆ చిత్రంలో నాయిక పాత్రను చేయాలన్నారు. అది కూడా తమిళ సూపర్‌స్టార్ రజినీ కాంత్ పక్కన. నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాతే బాలాజీగారు ఆ పాత్రకు శ్రీప్రియను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బాలాజీగారు కూడా స్వయంగా ప్రకటించారు. ఇంతమంచి ఆఫర్లు వదిలేసుకున్న నేను నిజంగా సినిమాల్లోకి మరోసారి వచ్చేందుకు కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నానా?
వాస్తవానికి ఇక నాకు సినిమాల్లో చేయాల్సిన అవసరం లేదు. నాకు పెద్దగా సినిమా జీవితంపై ఆసక్తి లేదు. దేవుడి దయవల్ల ఆర్థికంగా బాగానే కుదురుకున్నాను. నేను మిగిలిన జీవితమంతా కూడా రాణిమాదిరిగా బతికేయగలను ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి’ అంటూ ఆమె ఏమాత్రం దాపరికం లేకుండా ఖాస్ బాత్‌కు లేఖ రాశారు.