ఆమెకు మోదీ 'నరేంద్ర భాయ్'
న్యూఢిల్లీ: ఆమె పాకిస్థాన్‌కు చెందిన మహిళ. పెళ్లి అయిన తర్వాత భారత్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్న ఆమె గత 22 ఏళ్లుగా ఇక్కడే రాఖీ ఉత్సవం జరుపుకుంటోంది. కచ్చితంగా ఓ వ్యక్తికి ఆమె రాఖీ కడుతుంటుంది. కానీ, ఈ సంవత్సరం మాత్రం అలా జరుగుతుందో లేదో అని కాస్త ఆందోళన పడింది. అయితే, ఆమె ఆందోళనను తలగిందులు చేస్తూ ఆ వ్యక్తి నుంచి రాఖీ కట్టేందుకు ఆహ్వానం అందింది. దీంతో ఆమె మనసులోని ఆందోళన స్థానంలో ఆనందం వెళ్లి విరిసింది. ఇంతకీ ఆమెతో రాఖీ కట్టించుకుంటున్న వ్యక్తి ఎవరో కాదు.. మన ప్రధాని నరేంద్రమోదీ. అవునూ, ఖమర్ మోసిన్ షేక్ అనే మహిళ గత 22 ఏళ్లుగా నేటి ప్రధాని మోదీకి రాఖీ కడుతున్నారంట.
మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సెస్) కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఆమె మోదీకి రాఖీ కడుతున్నారంట. అయితే, ప్రస్తుతం ఎన్నికల హడావుడితోపాటు విదేశీ పర్యటనలు, ప్రధాని హోదాలో మరింత బిజీ అవడంతో ఈసారి అవకాశం ఉంటుందో ఉండదో అని భావించిన ఆమెకు సరిగ్గా రెండు రోజుల కిందటే ఆహ్వానం అందిందట. ఈ సందర్భంగా ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే పరిశీలిస్తే..
'నేను 22 నుంచి 23 ఏళ్లుగా నరేంద్ర భాయ్‌కి రాఖీ కడుతున్నాను. కానీ, ఈసారి మరింత ఉత్సాహంతో ఉన్నాను. నేను తొలిసారి రాఖీ కట్టినప్పుడు భాయ్ ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్నారు. ఆయన కఠిన శ్రమ, దూరదృష్టికారణంగా ప్రధాని అయ్యారు. ఈ ఏడాది మాత్రం నాకు ఆయన నుంచి ఫోన్ వస్తుందని ఊహించలేదు. కానీ, ఇంత బిజీలో ఉండి కూడా రెండు రోజుల కిందటే నాకు ఆయన నుంచి ఫోన్ వచ్చింది. దీంతో నాకు అమితానందంగా ఉంది. ప్రస్తుతం నేను రక్షాబంధన్ ఏర్పాట్లలో ఉన్నాను' అంటూ ఆమె చెప్పారు.