కారులో 12 కోట్లు.. | This UP chief engineer's corruption scandal pegged at Rs 900 crore | Sakshi
Sakshi News home page

కారులో 12 కోట్లు..

Published Sun, Nov 30 2014 1:50 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

కారులో 12 కోట్లు.. - Sakshi

కారులో 12 కోట్లు..

నోయిడా చీఫ్ ఇంజనీర్ యాదవ్‌సింగ్ ఇంటిపై ఐటీ దాడులు
భారీగా బయటపడిన అక్రమ ఆస్తులు
ఇంటివద్ద పార్క్ చేసిన కారులో 12 కోట్ల నగదు
ఇంట్లో 12 లక్షల నగదు, రెండు కిలోల బంగారు, వజ్రాభరణాలు
13 బ్యాంకు లాకర్లను సీజ్ చేసిన అధికారులు..
20 చోట్ల 130 మంది అధికారులతో తనిఖీలు.. కొనసాగుతున్న దాడులు
యాదవ్‌ను బాధ్యతల నుంచి తప్పించిన యూపీ సర్కారు

లక్నో/నోయిడా: విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న తరుణంలో... స్వదేశంలోనే ఓ భారీ నల్లధన ‘అవినీతి’ చేప ఆదాయ పన్ను శాఖకు చిక్కింది. కళ్లు చెదిరే స్థాయిలో కోట్ల రూపాయల నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు దొరికాయి. అంతేకాదు వారి సంబంధీకుల వద్దా కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, నగదు బయటపడ్డాయి.. ఈ ‘అవినీతి’ చేప దొరికింది దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఉండే నోయిడాలో కావడం గమనార్హం. నోయిడా, గ్రేటర్ నోయిడా చీఫ్ ఇంజనీర్ యాదవ్ సింగ్ నివాసంతో పాటు ఆయన భార్య కుసుమ్ లత, స్నేహితుల ఇళ్లపై, వారికి సంబంధించి పలు కంపెనీలపై గురు, శుక్రవారాల్లో ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది.

ఈ దాడుల సందర్భంగా యాదవ్‌సింగ్ ఇంటిపై చేసిన దాడిలో రూ. 12 లక్షల నగదును, రూ. కోట్ల విలువైన దాదాపు రెండు కిలోల బంగారు, వజ్రాభరణాలను అధికారులు గుర్తించారు. ఆయన సన్నిహితుడు రాజేంద్ర మనోచా ఇంట్లో దాడుల సందర్భంగా ఒక సోఫా కింద ఓ వాహనం తాళం చెవిని ఐటీ అధికారులు గుర్తించారు. దానిని ఇంటి బయట పార్క్ చేసి ఉన్న ఒక పెద్ద కారు తాళంచెవిగా గుర్తించి.. వెళ్లి చూసిన అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ కారులోని సీట్ల కింద రూ. 12 కోట్లు నగదు బయటపడింది. యాదవ్ భార్య మాజీ డెరైక్టర్‌గా ఉన్న కంపెనీ మెక్‌కన్ ఇఫ్రా లిమిటెడ్‌కు రాజేంద్ర మనోచా ప్రస్తుతం డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక యాదవ్ భార్య కుసుమ్ లతకు చెందిన మీను క్రియేషన్స్ సంస్థలో భాగస్వామిగా ఉన్న అనిల్ పెషావరి ఇంటిపై చేసిన దాడిలో రూ. 40 లక్షల నగదును, ఖాతాల్లో చూపని రూ. 12.5 కోట్ల విలువైన స్టాక్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవేగాకుండా యాదవ్‌కు  చెందిన 13 బ్యాంకు లాకర్లను సీజ్ చేశారు.
 
బాధ్యతల నుంచి తప్పించిన యూపీ..
ఐటీ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించిన నేపథ్యంలో.. యాదవ్ సింగ్‌ను చీఫ్ ఇంజనీర్ బాధ్యతల నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తప్పించింది. ఆయనను నొయిడా సిబ్బంది వ్యవహారాలశాఖకు అటాచ్ చేసినట్లు ఒక అధికారి వెల్లడించారు. ఐటీ అధికారుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని చెప్పారు. 20 చోట్ల 130 మందితో దాడులు..కాంట్రాక్టుల కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా తాము ఈ దాడులు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ డెరైక్టర్ జనరల్ (దర్యాప్తు విభాగం) కృష్ణై సెనీ చెప్పారు. నొయిడా, ఘజియాబాద్, ఢిల్లీల్లో యాదవ్‌తో పాటు ఆయన సంబంధీకులు, పలు సంస్థలకు చెందిన 20 చోట్ల 130 మంది అధికారులతో దాడులు జరిపామని.. ఇంకా దాడులు కొనసాగుతాయని తెలిపారు.

ఈ కుంభకోణానికి సంబంధించి దాదాపు 30 కంపెనీలపై ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, నోయిడా అధికారుల నుంచి పలు పత్రాలను సేకరించాల్సి ఉందని సైనీ తెలిపారు. కాగా.. యాదవ్ ప్రతి కాంట్రాక్టులో ఐదు శాతాన్ని కమిషన్‌గా తీసుకుంటారని సమాచారం అందినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఆయన భార్య కుసుమ్ లత పేరుమీద దాదాపు 40 నకిలీ కంపెనీలను నడిపిస్తున్నట్లుగా గుర్తించామని.. యాదవ్ తన అధికారాన్ని ఉపయోగించి పలు కంపెనీల పేరిట తక్కువ ధరలకు భూములను కొని ఎక్కువ ధరకు అమ్మేవారని పేర్కొన్నాయి.
 
మాయావతికి సన్నిహితుడు!
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతికి సన్నిహితుడిగా యాదవ్‌సింగ్‌కు పేరుంది. ఆమె ప్రభుత్వంలో ఆయన నోయిడాలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటికీ ఇన్‌చార్జిగా ఉన్నారు. అయితే ఆ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టుల కుంభకోణం నేపథ్యంలో.. 2012లో యాదవ్ సింగ్ సస్పెండయ్యారు. ఆ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి టెండర్లు పిలవకుండానే.. కేవలం ఎనిమిది రోజుల్లో రూ. 954 కోట్ల విలువైన కాంట్రాక్టులను యాదవ్ సింగ్ కట్టబెట్టడం గమనార్హం.  కానీ చిత్రంగా గత పదిహేను రోజుల కిందే.. తిరిగి నియామకం అయ్యారు. ఈ సారి నోయిడా, గ్రేటర్ నొయిడాలతో పాటు యమునా ఎక్స్‌ప్రెస్‌వే చీఫ్ ఇంజనీర్ బాధ్యతలను కూడా అప్పగించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement