మరో 40 కోట్ల మందికి తిండెట్లా?
మరో 40 కోట్ల మందికి తిండెట్లా?
Published Tue, May 30 2017 3:55 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
న్యూఢిల్లీ: భారత జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 సంవత్సరం నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం 129 కోట్లతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా ఉంది. 132 కోట్ల జనాభాతో చైనా మొదటి స్థానంలో ఉంది. 2050 నాటికి భారత దేశమే జనాభాలో నెంబర్ వన్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ విషయంలో భారత్ ఇప్పటికే నెంబర్ వన్ అని, 128 కోట్ల జనాభాతో చైనానే రెండవ స్థానంలో ఉందన్న వాదన కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా అంత జనాభాకు, అంటే అదనంగా పెరిగే 41 కోట్ల మందికి ఆహారాన్ని సమకూర్చడం ఎలా అన్నది అసలు సమస్య. ఈ అంశంపై ఇప్పటి నుంచి దృష్టి సారిస్తే తప్పా రానున్న సమస్యను అధిగమించలేం.
రానున్న కాలంలో మరో 40 కోట్ల మందికి ఆహారాన్ని అందించాలంటే దేశంలో తృణ ధాన్యాల ఉత్పత్తి 4.6 శాతం పెరగాలని వృవసాయ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉత్పత్తవుతున్న తృణ ధాన్యాలు రెట్టింపు కావాలి. రోజు రోజుకు సాగు భూములు తరగిపోతున్న నేపథ్యంలో అధిగ దిగుబడి ఒక్కటే మార్గం. ఆ అధిక దిగుబడికి ఏం చేయాలన్నది కీలకమైన ప్రశ్న. పాశ్చాత్య దేశాల్లో లాగా కాకుండా భారత్ ఇప్పటికే వ్యవసాయాధారిత దేశమే. దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో కూడా వ్యయసాయ ఉత్పత్తులే 18 శాతం ఆక్రమిస్తున్నాయి.
2000–01 సంవత్సరం సెన్సెస్ ప్రకారం దేశంలో 5.81 కోట్ల హెక్టార్ల భూమి మాత్రమే సాగయింది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమి దేశంలో 16 కోట్ల హెక్టార్లు ఉంది. అంటే ఇంకా మూడింతలు వ్యవసాయాన్ని పెంచవచ్చన్న మాట. వాటికి జల వనరులు అవసరం. జల వనరులు అందుబాటులో లేకనే ఎక్కువ భూములు నిరుపయోగంగా పడి ఉన్నాయి. దేశంలో చాలా కాలం నుంచి భూసంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు చోటు చేసుకోకపోవడం వల్ల పేద, సన్నకారు, మధ్యకారు రైతులే ఎక్కువ ఉన్నారు. ఒకటి, రెండు ఎకరాలున్న రైతులు దిగుబడి పెంచేందుకు ఆధునిక వ్యవసాయం చేయలేరు. సహకార వ్యవసాయమన్నది మన దేశంలో ఎక్కడోగాని లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. దానికి అనుగుణంగా అవసరమైతే భూ సంస్కరణలు తీసుక రావాలి. దిగుబడిని పెంచేందుకు కొత్త దారులు అన్వేషించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement