సాక్షి, చెన్నై: ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్క మందుబాబులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. కొంతమందికి పిచ్చి ముదిరి హాస్పిటల్ పాలవుతుంటే, మరికొందరేమో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తమిళనాడులోని చెంగల్పట్లులో ముగ్గరు మందుబాబులు మద్యం దొరకట్లేలేదని పెయింట్, వార్నిష్‌తో కలిపి సేవించారు. దీంతో తీవ్ర అనారోగ్యం చెంది మరణించారు. వీరిని శివశంకర్, ప్రదీప్, శివరామన్‌లుగా గుర్తించారు. ప్రతిరోజు మద్యం తాగే అలవాటున్న వీరు గత కొన్ని రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయారు. దీంతో విసుగు చెంది ఆదివారం పేయంట్‌తో కలిపిన వార్నిష్‌ను తాగారు. అంతే కొద్దిసేపటికే ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.
మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిత్యవసరాలు, ఆసుపత్రులు లాంటి అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు, షూటింగ్‌లు, కార్యాలయాలు మూతబడ్డాయి. మద్యం దుకాణాలు కూడా మూసివేయడంతో మందు దొరక్క చాలామంది మందుబాబులు వింతవింతగా ప్రవర్తించడంతో మెంటల్ హాస్పిటల్స్‌కు వారి తాకిడి పెరిగింది. మహారాష్ర్టలోని నాగ్‌పూర్‌లో ఓ రిక్షా కార్మికుడు మద్యం అందుబాటులో లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోనూ ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలను మూసివేసినట్లు ప్రకటించింది. ఇక కేరళలో మాత్రం ప్రభుత్వం మందుబాబులపై కరుణ చూపించింది. కరోనా లక్షణాలు లేనివారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే ఇంటి వద్దకే మద్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment