![Three passengers injured, window panel comes off during severe turbulence on Air India flight - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/23/AIR-INDIA.jpg.webp?itok=kRbQDGNC)
న్యూఢిల్లీ: ఓ విమానం.. 240 మంది ప్రయాణికులు.. 15 వేల అడుగుల ఎత్తు.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఊడిపడిన విమానం కిటికీ ప్యానెల్.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. తీవ్ర గందరగోళం.. ఆందోళన.. 12 నిమిషాలపాటు నరకం. ఎట్టకేలకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరిన విమానం. ఈనెల 19న అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఎయిరిండియా విమానంలో నెలకొన్న పరిస్థితి ఇది. విమానం 15 వేల అడుగుల ఎత్తులో ఉండగా తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో విమానం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది.
అదే సమయంలో కిటికీ ప్యానెల్ ఊడిపడటంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. విమానంలో, తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారు వేరే విమానాల్లో వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎయిరిండియాతోపాటు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టొరేట్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదాల దర్యాప్తు బోర్డు (ఏఏఐబీ) విచారణ జరుపుతున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి 50 సెకెన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఊడిపడిన కిటికీ ప్యానెల్‌ను తిరిగి బిగించేందుకు ఎయిర్ హోస్టెస్ ప్రయత్నిస్తుండటం అందులో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment