
ఆడపులి తోడుకోసం 250 కిలోమీటర్లు ప్రయాణించిన మగపులిని జుబువా ప్రాంతంలో స్థానికులు గుర్తించిన తీసిన ఫొటో
సాక్షి, ఇండోర్ : విరహతాపం తీర్చుకునేందుకు మధ్యప్రదేశ్‌లో ఒక పులి అసాధారణ విన్యాసం చేసింది. జోదడీని వెదుక్కుంటూ దాదాపు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే ఇంత సాహసం చేసిన మగ పులికి తోడు మాత్రం దొరకలేదు. దీంతో ఆడతోడు కోసం మగ పులి విరహంతో తపిస్తూ.. ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ అటవీశాఖాధికారులు కూడా ధృవీకరించారు.
దాదాపు మూడేళ్ల వయసున్న ఒక మగపులి.. తోడుకోసం తపిస్తోంది. ఆడపులిని వెతుక్కుంటూ.. దీవాస్, ఉజ్జయిని, ధార్, జబువా జిల్లాలను దాటుకుంటూ.. 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. మగపులి విరహం గురించి ఉజ్జయినీ అటవీ అధికారులు స్పందించారు. మగపులి బాధను మేం అర్థం చేసుకోగలం.. అయితే ఈ ప్రాంతంలో ఎక్కడా ఆడపులి జాడలేదని ఉజ్జయినీ ఫారెస్ట్ అధికారి బీఎస్ అన్నిగరి చెప్పారు. ఈ మగ పులి దాదాపు చాలా తెలివైందని ఆయన కితాబిచ్చారు. దాదాపు మూడు నెలలుగా జనసంచారంలో తిరుగుతూ కూడా.. ఎవరి కంటికి కనిపించకుండా ఆడ పులి కోసం వెతుకుతోందని చెప్పారు.
నగ్దా కొండలనుంచి మొదలైన ప్రయాణం మంగ్లియా, ఇండోర్, బాద్‌నగర్, ఉజ్జయిని, జవాసియా, ధార్, సరద్‌పూర్, జబువా వరకూ క్షేమంగా ప్రయాణించిందని అన్నారు. ప్రస్తుతం మగపులిని అదుపులోకి తీసుకున్నామని చెప్పిన ఫారెస్ట్ అధికారులు.. త్వరలోనే మరో ఆడపులికి కలుపుతామని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 2,226 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment