న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్యకేసులోని నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష వేసేందుకు రంగం సిద్ధమైంది. దేశంలో నలుగురు దోషులకు ఒకేచోట, ఒకేసారి ఉరిశిక్షను అమలు చేస్తున్న జైలుగా.. తీహార్ జైలు రికార్డు సృష్టించనుంది. గతంలో తీహార్ జైలులో ఒక ఉరికంబం మాత్రమే ఉండగా.. ఒకేసారి నలుగురు దోషుల ఉరితీతకు ఉరికంబాలు అవసరం అవుతుండడంతో జైలు అధికారులు ఆ దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అంతేకాక ఉరితీత సమయంలో జేసీబీ అవసరం కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే తీసుకువచ్చి తీహార్ జైలు ప్రాంగణంలో ఉంచారు. జేసీబీ యంత్రం సహాయంతో ఉరి తీయడానికి ఫ్రేమ్, భూగర్భంలో కొద్దిమేర గుంత తవ్వడానికి, ఉరిశిక్ష అనంతరం దోషుల మృతదేహాలను తరలించడానికి ఉపయోగించబడుతుంది.
వివరాల్లోకి వెళితే.. 2012, డిసెంబర్ 16న పారామెడికల్ విద్యార్థిని నిర్భయను అత్యంత అమానవీయంగా హత్యాచారం చేశార. సామూహిక అత్యాచారం అనంతరం ఆమెను కదులుతున్న బస్సులోంచి కిందకు తోసివేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబరు 29, 2012న ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. నిందితుల్లో ఒకరు జైలులోనే ఆత్మహత్య చేసుకోగా మరో నిందితుడు మైనర్ కావడంతో మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. మిగతా నలుగురు దోషులకు ఉరిశిక్షను ఖరారుచేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కాగా నిర్భయ దోషులకు డెత్ వారెంట్ల జారీపై విచారణను పటియాలా హౌజ్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment