సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం ప్రజల దృష్టి నిర్భయ ఘటన దోషులపైకి మళ్లింది. ఘటన జరిగి ఏడేళ్లకు పైగా గడుస్తున్నా.. దోషులకు పడిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడంలేదని మహిళా సంఘాలతో సహా.. పలువురు ప్రముఖులూ ప్రశ్నిస్తున్నారు. శిక్ష అమలు చేయకపోవడంపై నిర్భయ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారని, దానిపై రామ్‌నాథ్ కోవింద్ తుది నిర్ణయం తీసుకున్న అనంతరం శిక్షను అమలు చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే క్షమాభిక్ష పటిషన్‌పై వినయ్ శర్మ వెనక్కితగ్గారు. రాష్ట్రపతిని క్షమాభిక్ష వేడుకోలేదని ఆయన తరుఫున న్యాయవాది తెలిపారు. దీనిపై కేంద్ర నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు ఉరిశిక్ష అమలుకు తిహార్ జైలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దోషులను ఉరి తీసేందుకు జైలులో తలారి లేరని జైలు అధికారులు అంటున్నారు. దేశంలో ఉరిశిక్షలు చాలా తక్కువ సందర్భాల్లో అమలు అవుతున్న విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేవలం నాలుగురిని మాత్రమే ఉరితీశారు. దీంతో జైలులో ఉరి తీసేందుకు శాశ్వత సిబ్బందిని అధికారులు నియమించడంలేదు. అవసరం పడిన సందర్భాల్లో మాత్రమే తలారి కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు. తాజాగా నిర్భయ నిందితులును ఉరి తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుండటంతో ఆ మేరకు జైలు అధికారులు తలారి కోసం మల్లాగుల్లాలు పడుతున్నారు. కాగా వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌పై కేంద్ర హోంశాఖ తుది ప్రకటన వెలువడిన అనంతరం వారికి విధించిన శిక్షను అమలు చేస్తామని జైలు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment