టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు | TikTok Ban Shadow Over Indian Celeb Accounts | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు

Published Tue, Jun 30 2020 12:43 PM | Last Updated on Tue, Jun 30 2020 3:28 PM

 TikTok Ban Shadow Over Indian Celeb Accounts  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాపులర్ వీడియో-షేరింగ్ ప్లాట్ ఫాం టిక్‌టాక్ ను ప్రభుత్వం నిషేధించడంతో  పలువురు సెలబ్రిటీలతోపాటు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఖాతాలు కూడా చిన్నబోయాయి.  బాలీవుడ్ నటులు నుంచి వివిధ ప్రభుత్వ సంస్థలు డేటా భద్రతపై అవగాహనకోసం దీన్నిఇప్పటిదాకా విరివిగా ఉపయోగించుకున్నాయి. ప్రధానంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాధి విస్తరణపై ప్రజల్లో సందేహాలను, భయాలను తొలగించేందుకు,  మరింత అవగాహన కోసం దీన్ని వేదికగా చేసుకున్నాయి. అయితే తాజా నిషేధంతో  ఇవి ఒకింత నష్టపోయినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది.  (నిషేధంపై టిక్‌టాక్ స్పందన)

టిక్‌టాక్ తో బాటు మొత్తం 59 చైనా మొబైల్ యాప్ లను ప్రభుత్వం నిషేధించడంతో ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు  అయోమయంలో పడిపోయారు. టిక్‌టాక్ భారీ క్రేజ్  ను సొమ్ము చేసుకున్న సెలబ్రిటీలు తమ సినిమాల ప్రమోషన్ కోసం ఈ యాప్ ను బాగా వాడుకున్నారు.  అలాగే అభిమానులతో నిరంతరం టచ్ లో ఉంటూ వచ్చారు.  బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొనె నుంచి సారా అలీఖాన్, షాహిద్ కపూర్, మాధురీ దీక్షిత్,  టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్,  కృతి సనన్ ఈ వరుసలో ప్రముఖంగా ఉంటారు.  అయితే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారికి  కొంతకాలం కష్టాలు తప్పవనే అభిప్రాయం  వ్యక్తమవుతోంది.

నిషేధానికి ముందు, ఇటీవల టిక్‌టాక్ నుంచి తొలగించకముందు సుమారు పది లక్షల మంది ఫాలోవర్స్ తో చాలా యాక్టివ్ గా ఉన్న ప్రభుత్వ యాప్ మై గవర్నమెంట్ ఇండియా. అధికారిక  మైగోవ్ ఒక్కటే కాదు, దీంతోపాటు కర్ణాటక ప్రభుత్వం, గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ వంటి అనేక సంస్థలు కోవిద్-19పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దీన్ని వినియోగించుకుంటున్నాయి. అలాగే భారత-చైనా ఉద్రిక్తత, ప్రధానమంత్రి సందేశాలను ప్రచారంలోకి తెచ్చెందుకు ప్రెస్ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ యాప్ ని వినియోగించుకునేది. మరోవైపు చైనా కంపెనీతో సిగ్నలింగ్ కాంట్రాక్టును ఇటీవల రద్దు చేసుకున్న రైల్వే శాఖకూ టిక్‌టాక్  అకౌంట్ ఉండటం గమనార్హం.

అటు టిక్‌టాక్ నిషేధంపై సాధారణ ప్రజల్లో కూడా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. టిక్‌టాక్ నిషేధంతో వికృత వీడియోల బెడద తప్పిందని కొందరు భావిస్తోంటే, నిజమైన దేశభక్తులుగా చైనా యాప్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా  ప్రభుత్వ తీరు ఉందని కొంతమంది విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement