సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత మృతిపై తమిళనాడు న్యాయ శాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను విదేశాలకు తరలించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేవారని వ్యాఖ్యానించారు. జయలలిత ఆస్పత్రిలో ఉండగా ఆమె ఆరోగ్యంపై వైద్యారోగ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ మోహనరావులు విచారణ కమిషన్‌ను అవాస్తవ సమాచారంతో తప్పుదారి పట్టించారని షణ్ముగం ఆరోపించారు.
జయలలిత ఆస్పత్రిలో ఉండగా వీరి పాత్రపై సందేహం వ్యక్తం చేస్తూ ఈ అంశంపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చికిత్స నిమిత్తం జయలలితను విదేశాలకు తీసుకువెళ్లే ప్రతిపాదనను వైద్యారోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ వ్యతిరేకించారని, అలా చేస్తే భారత వైద్యుల ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన భావించారని చెప్పారు. ఆయన స్వయంగా డాక్టర్ అయి ఉండీ రోగి పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.
జయలలితకు యాంజయోగ్రామ్ నిర్వహించాలని ముగ్గురు వైద్యులు సూచించినా ఎందుకు పరీక్షలు చేయలేదని ప్రశ్నించారు. ఆమెకు ఎందుకు యాంజియోగ్రామ్ చేయలేదని, తప్పుడు వైద్యం ఎవరు చేపట్టారని నిలదీశారు. ఆస్పత్రిపై ఎవరు అజమాయిషీ చేశారనే వాస్తవాలు వెలుగుచూడాల్సి ఉందన్నారు.
కాగా జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అపోలో ఆస్పత్రితో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆర్ముగస్వామి కమిషన్ పిటిషన్‌లో ఆరోపించిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జయ ఆస్పత్రిలో ఉండగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ మోహన్‌రావు తప్పుడు ఆధారాలు సమర్పించారని ఈ పిటిషన్ ఆరోపించింది. జయలలిత మృతిపై ఆర్ముగస్వామి కమిషన్ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment