ముంబై: మహారాష్ట్రలో బీజేపీ.. శివసేన పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. తమ తమ ప్రచారాలకు వినూత్నమార్గాన్ని ఎంచుకున్నాయి. శివసేన 'శివ్ వడాపావ్' పేరుతో తినుబండారాలను అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి ప్రతిగా బీజేపీ 'నమో టీ స్టాల్' పేరుతో నగరవ్యాప్తంగా టీ దుకాణాలను తెరవాలని నిర్ణయం తీసుకుంది. నమో అంటే నరేంద్ర మోదీ అన్న విషయం తెలిసిందే.
నమో టీ స్టాళ్లను తమ పార్టీ సమావేశంలో నగర కార్పొరేటర్ ప్రకాశ్ గంగాధర్ ప్రతిపాదించారని, దీనిని పార్టీ ఆమోదించిందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ నాయకుడు మనోజ్ కుమార్ తెలిపారు. ఈ ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎమ్‌సీజీఎమ్) కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపామని మనోజ్ తెలిపారు. కాగా ఇరుపార్టీల తీరును ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ ఛద్దా తప్పు పట్టారు.