
రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని ధర్నా
వేలూరు: ముకుందరాయపురంలోని సిప్‌కాట్‌లో ఫ్యాక్టరీలకు భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాణిపేట ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమిలనాడు వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి దయానిధి మాట్లాడుతూ సిప్‌కాట్‌లో ఫ్యాక్టరీల కోసం భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటామని యజమానులు తెలిపారని పేర్కొన్నారు. ఇప్పుడు వారి గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన రైతులకు నిరాశను మిగల్చడం సరికాదన్నారు. భూమి కోల్పోయిన రైతుల వారసులకు అర్హత ఆధారంగా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్‌డీవో ప్రియదర్శినికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాశీనాథన్, అధ్యక్షులు రామచంద్రన్, తాలూకా కార్యదర్శి వెంకటేశన్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.