ఆయన ఏం చెప్తారో చెప్పనివ్వండి!
న్యూఢిల్లీ: ఏ ఒక్కరి ఇష్టానుసారం ప్రజాస్వామ్యం పనిచేయబోదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. 'ఆయన ఏం చెప్తారో చెప్పనివ్వండి' అంటూ మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుండటంతో ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొందరు తమకు ఇష్టం వచ్చింది, తోచింది చేయాలనుకుంటున్నారని, ఇలాగైతే దేశం నడుస్తుందా? అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోదీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలపై సోనియా ప్రతిస్పందన వ్యక్తమైంది. ప్రతిపక్షాల నుంచి ప్రధాని ఏం కోరుకుంటున్నారో చెప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు.
మరాఠా రాజకీయ యోధుడు శరద్‌పవార్ 75వ పుట్టినరోజు వేడుకలో సోనియా, మోదీ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌తో మోదీ కరచాలనం చేశారు. సోనియాతో కూడా మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సోనియా ప్రతిస్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లును రాజ్యసభలో ఆమోదించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతును మోదీ ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే.