బలగాల కాల్పుల్లో హతమైన అబ్దుల్ ఖయ్యూం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో హిజ్బుల్ టాప్ కమాండర్ అబ్దుల్ ఖయూం నజర్‌ను భారత బలగాలు మట్టుబెట్టాయి. గత 17 ఏళ్లలో దాదాపు 50కి పైగా హత్యలతో ప్రమేయమున్న నజర్ మరణంతో భద్రతా బలగాలు భారీ విజయం సాధించినట్లైంది. నియంత్రణ రేఖ వద్ద కశ్మీర్‌లోకి చొరబడేందుకు నజర్ ప్రయత్నిస్తుండగా.. ఎదురుకాల్పుల్లో అతను హతమైనట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
‘సరిహద్దు వెంట ఉడీ సెక్టార్‌లో లచిపొరా వద్ద మంగళవారం ఉదయం చొరబాటు యత్నాల్ని భద్రతా దళాలు భగ్నం చేసి నజర్‌ను హతమార్చాయి. ఇటీవల హిజ్బుల్ టాప్ కమాండర్లు వరుసగా భారత బలగాల చేతిలో మరణించడంతో.. ఆ సంస్థ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టడం కోసం నజర్ పాకిస్తాన్ నుంచి కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు’ అని బారాముల్లా సీనియర్ ఎస్పీ ఇంతియాజ్ హుస్సేన్ చెప్పారు. అనేక మంది ప్రజలు, పోలీసులతో పాటు భద్రతా సిబ్బందిని నజర్ హత్యచేశాడని, పలు పేలుళ్ల కేసుల్లో అతని ప్రమేయముంద న్నారు.
సొపోర్ పట్టణానికి చెందిన నజర్.. హిజ్బుల్ కమాండర్ అబ్దుల్ మజీద్ దార్ హత్యతో 2003లో ఉగ్ర జీవితాన్ని మొదలుపెట్టాడు. హిజ్బుల్‌తో భేదాభిప్రాయాల నేపథ్యంలో 2015లో పీఓకేలోని ముజఫరాబాద్ ఉగ్ర శిబిరానికి వెళ్లి అగ్ర నేతలతో చర్చలు జరిపాడు. ఇటీవల కశ్మీర్‌లో వరుసగా టాప్ కమాండర్లు హతమైన నేపథ్యంలో హిజ్బుల్‌కు పునరుత్తేజం తెచ్చే బాధ్యతల్ని నజర్‌కు అప్పగించారు.