లక్నో : తనకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులపై ప్రతీకార చర్యగా సదరు ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషనుకు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు ఓ అధికారి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు... శ్రీనివాస్ అనే వ్యక్తి దక్షిణాంచల్ విద్యుత్ విట్రన్ నిగమ్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన వ్యక్తిగత పనికోసం బైక్ మీద బయల్దేరారు. అయితే శ్రీనివాస్ హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఆయన బండిని ఆపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రూ. 500 చలానా విధించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యుత్ బకాయిలు చెల్లించని పోలీసులు ఇలా జరిమానా విధించడం సరికాదంటూ శ్రీనివాస్ ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ఫిరోజాబాద్ పరిధిలోని పోలీసు స్టేషను.. విద్యుత్ సంస్థకు రూ. 6 లక్షలు బకాయి పడిందని.. అలాంటిది తానెందుకు రూ. 500 జరిమానా చెల్లించాలని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన నుంచి పోలీసులు చలానా వసూలు చేశారు.
ఈ నేపథ్యంలో తన కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్ పై అధికారులను సంప్రదించకుండానే పోలీసు స్టేషనుకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సుమారు నాలుగు గంటల పాటు కరెంట్ పోవడంతో పోలీసులు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment