
సాక్షి,బెంగళూరు: పర్యాటకం ఇక ప్రియం కానుంది. నిర్వహణ, మౌలిక సదుపాయల పెంపు తదితర కారణాలను చూపుతూ ఆయా పర్యాటక ప్రాంతాల ప్రవేశ రుసుము, బోర్డింగ్ చార్జీలు, బోటింగ్ తదితర వాటి ధరలను పెంచుతూ రాష్ట్ర అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా స్వదేశీ పర్యాటకులకు, విదేశీ పర్యాటకులకు వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. కొత్త ధరల ప్రకారం బండీపుర, బిళిగిరిరంగినబెట్టచనాగరహళె, దాండేలి తదితర అభయారణ్యాల ప్రవేశ రుసుమును స్వదేశీ పర్యాటకులకు రూ.550గా నిర్ణయించగా విదేశీ పర్యాటకులకు రూ.1,800గా నిర్ణయించారు.
అదేవిధంగా నాగరహళె, అంతరసంతె అభయారణ్యాల్లో వైల్డ్‌లైఫ్ సఫారీ ధరలతో పాటు వైల్డ్‌సఫారీ సమయాన్ని కూడా అదనంగా రెండు గంటల పాటు పెం చుతూ అటవీశాఖ నిర్ణయించింది. ఇక పక్షిధామాల ప్రవేశ రుసుముతో పాటు పక్షిధామాల్లో బోటింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీల ధరలను కూడా పెంచారు. వీటితో పాటు నేషనల్‌పార్క్, అభయారణ్యాలు, పక్షిధామాలకు వచ్చే పర్యాటకుల వాహనాల పార్కింగ్ చార్జీలను కూడా పెంచారు. కాగా విద్యార్థులు, పిల్లలు, వికలాంగులను మాత్రం కొత్తగా అమలు చేయనున్న ధరల నుంచి మినహాయించారు.
మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం
‘అభయారణ్యలు, పక్షిధామాలకు దేశవిదేశాల నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలు, నిర్వహణ వ్యయాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రుసుం పెంచాల్సి వచ్చింది. పర్యాటకులపై భారం పడకుండా స్వల్ప మొత్తంలోనే ధరలను నిర్ణయించాం’–హన్నట్టి శ్రీధర్, అటవీ సంరక్షణ ముఖ్య కార్యదర్శి