అడవిబిడ్డలకు వేగుచుక్క | Tribals Karaf Kalinga Institute of Social Sciences | Sakshi
Sakshi News home page

అడవిబిడ్డలకు వేగుచుక్క

Published Sun, Dec 10 2017 1:49 AM | Last Updated on Sun, Dec 10 2017 1:49 AM

Tribals Karaf Kalinga Institute of Social Sciences - Sakshi

ఏటా రూ.వేల కోట్ల బడ్జెట్‌ వెచ్చించి, ప్రణాళికలు రచించే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పనిని ఓ వ్యక్తి తన పాతికేళ్ల కషితో సాధిస్తున్నారు. సమాజపు అట్టడుగున నిరాదరణకు గురవుతున్న గిరిజన జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘విద్య’గొప్ప పనిముట్టని భావించి, వారికా అవకాశం కల్పించడం ద్వారా హుందాగా, సమానత్వంతో, సాధికారతతో ఇతరులతో సమానంగా జీవించేలా వారి మానవ హక్కుల్ని పరిరక్షిస్తున్నారు. జీవించే కనీస మానవ హక్కును అనుభవించడానికి విద్య పొందే అవకాశం లభించడం, లభించకపోవడం మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపిస్తున్న విజయగాథ ఇది.
అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా..

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా దెనువా గ్రామానికి చెందిన రజనీకాంత్‌ నాయక్‌కు తండ్రి లేడు.. తల్లి దినకూలీ.. సోదరి అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది.. ఇంట్లో తిండికీ కష్టమైంది.. కానీ ఐఐటీలో సీటు సాధించడానికి ఇవేవీ అవరోధాలు కాలేదు.. కారణం.. కేఐఎస్సెస్‌ (కిస్‌).
కడు పేదరికం రోజూ కన్నీళ్లు పెట్టిస్తోంది. బతికే ఆశను గృహహింస సన్నగిల్లింపజేస్తోంది. కానీ కిస్‌ ద్వారా తండా బడి డ్రాపవుట్, సుమిత్రా నాయక్‌ బతుకు దిశ మారింది. 2008లో కిస్‌లో చేరిన సుమిత్రా.. రగ్బీపై అనురక్తి పెంచుకుని, అక్కడి క్రీడాసౌకర్యాల్ని వినియోగించుకుని 2014లో 13 ఏళ్ల లోపు పిల్లల భారత రగ్బీ జట్టుకు నాయకత్వం వహించింది. లండన్‌ అంతర్జాతీయ పోటీల్లో దేశాన్ని విజయతీరాలకు చేర్చింది. గతేడాది ప్యారిస్‌లో జరిగిన ప్రపంచ 19 ఏళ్లలోపు పిల్లల రగ్బీ పోటీల్లో భారత జట్టుకు నేతృత్వం వహించింది. ప్రస్తుతం భారత రగ్బీ జట్టుకు ఆమే కెప్టెన్‌. 2017 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికీ సుమిత్రా నామినేటయింది.
పీటీ ఉష తర్వాత 36 ఏళ్లకు గానీ దేశానికి చెందిన మరో అథ్లెట్‌ ఒలింపిక్‌ (స్వల్ప దూరపు పరుగు) పోటీలకు ఎంపికవలేదు. గతేడాది ‘రియో ఒలింపిక్‌’కు ఎంపికవడం ద్వారా ‘కిస్‌’కు చెందిన 20 ఏళ్ల యువతి దుతీ చంద్‌ ఆ ఘనత సాధించింది. పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చి, పట్టుదలతో అవకాశాలను అందిపుచ్చుకున్న ఆమె అంకితభావాన్ని దేశం ఎంతగానో ప్రశంసించింది.
ఈ ఏడాది 20 మంది కేఐఎస్సెస్‌(కిస్‌) విద్యార్థులు చైనాలోని షాంఘై విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఉచిత ఉన్నత విద్య, తదనంతరం బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాల కోసం ఎంపికయ్యారు. ఐఐటీలు, ఐఐఎంలు, స్వదేశీ–విదేశీ వర్సిటీలు, ఇతర కీలక సంస్థల్లో ఇంకెందరో ప్రవేశాలు పొందుతున్నారు.
ఓ చిన్న ఆలోచనతో మొదలైన ఒక ఔత్సాహికుని కృషి–తపన సంస్థగా, కడకొక సామాజిక విప్లవంగా మారింది’అని ఆమెరికా ఆంథ్రపాలజీ పుస్తకాల్లో కేఐఎస్సెస్‌ కథను సిలబస్‌గా రాశారు.

ఆకాశమే హద్దుగా..
ఆకాశమే హద్దుగా పైపైకి ఎదుగుతున్న 27,000 మంది కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, కేఐఎస్సెస్‌ (కిస్‌) విద్యార్థులంతా అత్యంత పేదరికం నుంచి వచ్చిన గిరిజనులే! కేజీ నుంచి పీజీ వరకు రూపాయి చెల్లించకుండా నాణ్యత గల విద్యను వీరు పొందుతున్నారు. ఒకసారి చేరితే.. ఉన్నత విద్యాకోర్సుల్లోకో, ఉపాధితోనో బయటకు వస్తారేగాని డ్రాపవుట్స్‌ ఉండరు. విద్య మాత్రమే కాదు.. బట్టలు, భోజనం, వసతి, వైద్యం వీరికి ఉచితంగా లభిస్తోంది.

కేఐఎస్సెస్‌లో 60 శాతం మంది అమ్మాయిలే! అన్నిటికీ మించి.. ఆ 27,000 మందిని ఏ వేళ చూసినా వయసుతో నిమిత్తం లేకుండా ఓ ఉత్సాహం, ఓ దర్పం కలగలిసిన వెలుగు వారి ముఖాల్లో తారాడుతుంది. కేఐఎస్సెస్‌ నిర్మాణపు మూలాల్లోనే అటువంటి శక్తి ఏదో దాగుందనిపిస్తుంది. క్రమంగా ఎదిగిన ఈ సంస్థ.. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) ప్రత్యేక సంప్రదింపుల హోదా పొందడమే కాకుండా కేంద్రం నుంచి ఈ ఏడాదే డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా సంపాదించింది.  

సదాచరణతోనే..
‘సామాజిక పరివర్తనకు, సామాన్యుల సాధికారతకు విద్య ఓ ఉపకరణం’అనే నినాదంతో ప్రారంభించి, ఆ సత్యాన్ని అక్షరాలా నిరూపిస్తున్నాడు అచ్యుత్‌ సామంత. యూఎన్‌ నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) దిశలో ఎన్నో పర్యావరణ అనుకూల విధానాల్ని కిస్‌ ప్రాంగణంలో పాటిస్తున్నారు. బయోగ్యాస్, స్టీమ్‌ కిచెన్, సౌర విద్యుత్, హరిత వృద్ధి, చేతి వృత్తులు, ఉపాధి శిక్షణ, వస్తోత్పత్తి.. ఇలా ఎన్నెన్నో! ప్రాథమిక స్థాయి విద్యా బోధనలో మాతృ భాషకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. గిరిజన భాషల్లో ఉన్న 32 రకాలు/మాండలికాలు బోధించే సిబ్బంది ఈ సంస్థలో ఉన్నారు. పిల్లల్ని బెదరగొట్టరు. ప్రాథమిక స్థాయి నుంచి ఎదిగే క్రమంలోనే వారికి తల్లి భాష నుంచి ఉమ్మడి గిరిజన భాష, తదనంతర దశలో ఒడియా, హిందీ, ఇంగ్లి్లష్‌ వంటి ఇతర భాషల వైపు మళ్లించేలా సిలబస్‌ రూపొందించారు.  

కిస్, కిట్‌.. రెండింటికీ డీమ్డ్‌ హోదా..
దాదాపు 25 శాతం గిరిజన జనాభా ఉన్న ఒడిశాలో అత్యధిక గిరిజన కుటుంబాల్లో పేదరికం తాండవిస్తోంది. కనీస జీవన పరిస్థితులుండవు. ఆకలి, అనారోగ్యం, నిరక్షరాస్యత అతి సాధారణ విషయాలిక్కడ. ‘స్వయంగా వాటిని అనుభవించిన నేను, వాటి నిర్మూలనకు ‘విద్య’మాత్రమే గొప్ప ఉపకరణం అని మనసారా నమ్మాను, అది అందించే కృషి చేస్తున్నాను, ఇదంతా ఈశ్వరేచ్ఛ’అంటాడు అచ్యుత్‌ సామంత.

ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ప్రొఫెసర్‌ అయిన సామంత.. 1992లో 125 మందితో కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ, కేఐఐటీ (కిట్‌)ను ప్రారంభించారు. ఇందులో ఎవరైనా ఫీజు చెల్లించి చేరొచ్చు. మరుసటి సంవత్సరం 1993లో గిరిజనులకు మాత్రమే ఉచిత ప్రవేశమున్న ‘కిస్‌’ను ప్రారంభించారు. ‘కిట్‌’, ‘కిస్‌’రెండింటికీ ఇప్పుడు డీమ్డ్‌ వర్సిటీ హోదా లభించింది. రెండు చోట్లా దాదాపు సమాన సంఖ్యలో (27,000) విద్యార్థులున్నారు.  

కిట్‌ నిధులు కిస్‌కు..
ఇంజనీరింగ్, మెడికల్‌తోపాటు పలు వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్న ‘కిట్‌’లో ఉన్నత ప్రమాణాల దృష్ట్యా ప్రవేశాలకు ఎంతో డిమాండ్‌ ఉంది. ఫీజులూ అదే స్థాయిలో ఉంటాయి. ‘కిట్‌’ లాభాలను ‘కిస్‌’నిర్వహణకు మళ్లిస్తూ, బోధన–బోధనేతర సిబ్బంది (3–7 శాతం వరకు స్వచ్ఛంగా) ఇచ్చే విరాళాలను, ఇతర వనరుల నుంచి లభించే నిధులతో ‘కిస్‌’ను నిర్వహిస్తున్నారు. ఏటా రూ.85 నుంచి రూ.95 కోట్ల నిర్వహణ వ్యయం ఉంటుందంటారు. ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన రూ.500 కోట్ల రుణంలో సగానికిపైగా మొత్తాన్ని మౌలికవసతుల కల్పనకు వెచ్చించారు. యూఎన్‌తో పాటు వివిధ ప్రపంచ, జాతీయ స్థాయి కంపెనీలు సహకారం అందిస్తున్నాయి. ఉదాహరణకు.. టాటాస్టీల్‌ సహకారంతో రూ.4.4 కోట్లు వెచ్చించి 150 సీట్ల లైబ్రరీ ఏర్పాటు చేశారు.

తన జీవితమే పాఠమంటాడు
నాలుగేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాక తల్లి, తనతో పాటు మరో నలుగురు పిల్లలతో బతుకు పోరు ప్రారంభించిన సామంత.. చిన్నతనంలోనే కష్టాల కడలి ఈదాడు. వెక్కిరించే పేదరికాన్ని చేతుల కష్టంతో ఎదురించాడు. బాగా చదువుకున్నాడు. ప్రొఫెసరయ్యాడు. తన కర్తవ్యాన్ని విభిన్నంగా ఆలోచించాడు. ‘కిట్‌’‘కిస్‌’లను అభివృద్ధి పరచిన పాతికేళ్ల ప్రస్తానంలో ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూశానంటారు సామంత. ఈ క్రమంలో ‘బ్యూరోక్రసీతో నా ప్రయోగాలు’ఓ పుస్తకమవుతుందంటారు. పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలి, అందుకు విద్య ఒక గొప్ప ఉపకరణం అంటారాయన.

2 లక్షల మంది గిరిజనుల్ని ‘కిస్‌’పరిధిలోకి తెచ్చే లక్ష్య సాధనకు ఒడిశాలోని 30 జిల్లాల్లో, కనీసం 10 రాష్ట్రాల్లో ‘కిస్‌’బ్రాంచీలు ఏర్పాటు చేస్తానంటారు. ప్రభుత్వాలు సహకరిస్తే గిరిజన జీవన స్థితిగతులు మార్చే సామాజిక పరివర్తన సుసాధ్యమంటారు. ఎంతో వినయంగా, నిబ్బరంగా ఉండే సామంత.. విజయ రహస్యం పూర్తిగా అర్థం కాలే దు. కానీ, ఇప్పటికీ సొంత బ్యాంక్‌ అకౌంట్‌ లేకుం డా, సొంత ఇల్లు లేకుండా, 2 గదుల అద్దె ఇంట్లో ఉంటూ అలవర్చుకున్న నిరాడంబర జీవన శైలి, నిస్వార్థ సేవ కూడా ప్రధాన కారణమే అనిపించింది.
 

10 వేల మంది దిగ్విజయంగా..
దేశ–విదేశాల అత్యున్నత హోదాల్లోని రాజ్యాంగాధినేతలు, నాయకులు, రాజనీతిజ్ఞులు, న్యాయమూర్తులు, సామాజిక వేత్తలతో పాటు 15 మంది నోబెల్‌ బహుమతి గ్రహీతలు సందర్శించి, ప్రశంసించిన ఈ ప్రపంచ స్థాయి విద్యా సంస్థ మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉంది. ఒడిశాలోని అన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఈ యజ్ఞం పాతికేళ్లుగా సాగుతోంది.

62 గిరిజన ఉప (13 అతి ఆదిమ) జాతుల విద్యార్థులు ఇక్కడున్నారు. ఇప్పటివరకు 10,000 మంది ఈ విద్యాసంస్థ నుంచి దిగ్విజయంగా బయటకొచ్చారు. ఈ కృషికి కర్త, కర్మ, క్రియ అంతా.. 51 ఏళ్ల అవివాహితుడైన డాక్టర్‌ అచ్యుత్‌ సామంత. సంస్థ నిర్వహణ బాధ్యతలు ముఖ్యులకు అప్పగించి, ప్రస్తుతం ఫౌండర్‌ చైర్మన్‌ హోదాకే సామంత పరిమితమైనా అన్ని వ్యవహారాలూ ఆయన కనుసన్నల్లోనే సాగుతాయి.

– సాక్షి ప్రత్యేక ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement