Kalinga Institute of Social Sciences
-
అడవిబిడ్డలకు వేగుచుక్క
ఏటా రూ.వేల కోట్ల బడ్జెట్ వెచ్చించి, ప్రణాళికలు రచించే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పనిని ఓ వ్యక్తి తన పాతికేళ్ల కషితో సాధిస్తున్నారు. సమాజపు అట్టడుగున నిరాదరణకు గురవుతున్న గిరిజన జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘విద్య’గొప్ప పనిముట్టని భావించి, వారికా అవకాశం కల్పించడం ద్వారా హుందాగా, సమానత్వంతో, సాధికారతతో ఇతరులతో సమానంగా జీవించేలా వారి మానవ హక్కుల్ని పరిరక్షిస్తున్నారు. జీవించే కనీస మానవ హక్కును అనుభవించడానికి విద్య పొందే అవకాశం లభించడం, లభించకపోవడం మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపిస్తున్న విజయగాథ ఇది. అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా.. ♦ ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా దెనువా గ్రామానికి చెందిన రజనీకాంత్ నాయక్‌కు తండ్రి లేడు.. తల్లి దినకూలీ.. సోదరి అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది.. ఇంట్లో తిండికీ కష్టమైంది.. కానీ ఐఐటీలో సీటు సాధించడానికి ఇవేవీ అవరోధాలు కాలేదు.. కారణం.. కేఐఎస్సెస్ (కిస్). ♦ కడు పేదరికం రోజూ కన్నీళ్లు పెట్టిస్తోంది. బతికే ఆశను గృహహింస సన్నగిల్లింపజేస్తోంది. కానీ కిస్ ద్వారా తండా బడి డ్రాపవుట్, సుమిత్రా నాయక్ బతుకు దిశ మారింది. 2008లో కిస్‌లో చేరిన సుమిత్రా.. రగ్బీపై అనురక్తి పెంచుకుని, అక్కడి క్రీడాసౌకర్యాల్ని వినియోగించుకుని 2014లో 13 ఏళ్ల లోపు పిల్లల భారత రగ్బీ జట్టుకు నాయకత్వం వహించింది. లండన్ అంతర్జాతీయ పోటీల్లో దేశాన్ని విజయతీరాలకు చేర్చింది. గతేడాది ప్యారిస్‌లో జరిగిన ప్రపంచ 19 ఏళ్లలోపు పిల్లల రగ్బీ పోటీల్లో భారత జట్టుకు నేతృత్వం వహించింది. ప్రస్తుతం భారత రగ్బీ జట్టుకు ఆమే కెప్టెన్. 2017 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికీ సుమిత్రా నామినేటయింది. ♦ పీటీ ఉష తర్వాత 36 ఏళ్లకు గానీ దేశానికి చెందిన మరో అథ్లెట్ ఒలింపిక్ (స్వల్ప దూరపు పరుగు) పోటీలకు ఎంపికవలేదు. గతేడాది ‘రియో ఒలింపిక్’కు ఎంపికవడం ద్వారా ‘కిస్’కు చెందిన 20 ఏళ్ల యువతి దుతీ చంద్ ఆ ఘనత సాధించింది. పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చి, పట్టుదలతో అవకాశాలను అందిపుచ్చుకున్న ఆమె అంకితభావాన్ని దేశం ఎంతగానో ప్రశంసించింది. ♦ ఈ ఏడాది 20 మంది కేఐఎస్సెస్(కిస్) విద్యార్థులు చైనాలోని షాంఘై విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఉచిత ఉన్నత విద్య, తదనంతరం బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాల కోసం ఎంపికయ్యారు. ఐఐటీలు, ఐఐఎంలు, స్వదేశీ–విదేశీ వర్సిటీలు, ఇతర కీలక సంస్థల్లో ఇంకెందరో ప్రవేశాలు పొందుతున్నారు. ♦ ఓ చిన్న ఆలోచనతో మొదలైన ఒక ఔత్సాహికుని కృషి–తపన సంస్థగా, కడకొక సామాజిక విప్లవంగా మారింది’అని ఆమెరికా ఆంథ్రపాలజీ పుస్తకాల్లో కేఐఎస్సెస్ కథను సిలబస్‌గా రాశారు. ఆకాశమే హద్దుగా.. ఆకాశమే హద్దుగా పైపైకి ఎదుగుతున్న 27,000 మంది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కేఐఎస్సెస్ (కిస్) విద్యార్థులంతా అత్యంత పేదరికం నుంచి వచ్చిన గిరిజనులే! కేజీ నుంచి పీజీ వరకు రూపాయి చెల్లించకుండా నాణ్యత గల విద్యను వీరు పొందుతున్నారు. ఒకసారి చేరితే.. ఉన్నత విద్యాకోర్సుల్లోకో, ఉపాధితోనో బయటకు వస్తారేగాని డ్రాపవుట్స్ ఉండరు. విద్య మాత్రమే కాదు.. బట్టలు, భోజనం, వసతి, వైద్యం వీరికి ఉచితంగా లభిస్తోంది. కేఐఎస్సెస్లో 60 శాతం మంది అమ్మాయిలే! అన్నిటికీ మించి.. ఆ 27,000 మందిని ఏ వేళ చూసినా వయసుతో నిమిత్తం లేకుండా ఓ ఉత్సాహం, ఓ దర్పం కలగలిసిన వెలుగు వారి ముఖాల్లో తారాడుతుంది. కేఐఎస్సెస్ నిర్మాణపు మూలాల్లోనే అటువంటి శక్తి ఏదో దాగుందనిపిస్తుంది. క్రమంగా ఎదిగిన ఈ సంస్థ.. ఐక్యరాజ్య సమితి (యూఎన్) ప్రత్యేక సంప్రదింపుల హోదా పొందడమే కాకుండా కేంద్రం నుంచి ఈ ఏడాదే డీమ్డ్ యూనివర్సిటీ హోదా సంపాదించింది. సదాచరణతోనే.. ‘సామాజిక పరివర్తనకు, సామాన్యుల సాధికారతకు విద్య ఓ ఉపకరణం’అనే నినాదంతో ప్రారంభించి, ఆ సత్యాన్ని అక్షరాలా నిరూపిస్తున్నాడు అచ్యుత్ సామంత. యూఎన్ నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) దిశలో ఎన్నో పర్యావరణ అనుకూల విధానాల్ని కిస్ ప్రాంగణంలో పాటిస్తున్నారు. బయోగ్యాస్, స్టీమ్ కిచెన్, సౌర విద్యుత్, హరిత వృద్ధి, చేతి వృత్తులు, ఉపాధి శిక్షణ, వస్తోత్పత్తి.. ఇలా ఎన్నెన్నో! ప్రాథమిక స్థాయి విద్యా బోధనలో మాతృ భాషకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. గిరిజన భాషల్లో ఉన్న 32 రకాలు/మాండలికాలు బోధించే సిబ్బంది ఈ సంస్థలో ఉన్నారు. పిల్లల్ని బెదరగొట్టరు. ప్రాథమిక స్థాయి నుంచి ఎదిగే క్రమంలోనే వారికి తల్లి భాష నుంచి ఉమ్మడి గిరిజన భాష, తదనంతర దశలో ఒడియా, హిందీ, ఇంగ్లి్లష్ వంటి ఇతర భాషల వైపు మళ్లించేలా సిలబస్ రూపొందించారు. కిస్, కిట్.. రెండింటికీ డీమ్డ్ హోదా.. దాదాపు 25 శాతం గిరిజన జనాభా ఉన్న ఒడిశాలో అత్యధిక గిరిజన కుటుంబాల్లో పేదరికం తాండవిస్తోంది. కనీస జీవన పరిస్థితులుండవు. ఆకలి, అనారోగ్యం, నిరక్షరాస్యత అతి సాధారణ విషయాలిక్కడ. ‘స్వయంగా వాటిని అనుభవించిన నేను, వాటి నిర్మూలనకు ‘విద్య’మాత్రమే గొప్ప ఉపకరణం అని మనసారా నమ్మాను, అది అందించే కృషి చేస్తున్నాను, ఇదంతా ఈశ్వరేచ్ఛ’అంటాడు అచ్యుత్ సామంత. ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ప్రొఫెసర్ అయిన సామంత.. 1992లో 125 మందితో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, కేఐఐటీ (కిట్)ను ప్రారంభించారు. ఇందులో ఎవరైనా ఫీజు చెల్లించి చేరొచ్చు. మరుసటి సంవత్సరం 1993లో గిరిజనులకు మాత్రమే ఉచిత ప్రవేశమున్న ‘కిస్’ను ప్రారంభించారు. ‘కిట్’, ‘కిస్’రెండింటికీ ఇప్పుడు డీమ్డ్ వర్సిటీ హోదా లభించింది. రెండు చోట్లా దాదాపు సమాన సంఖ్యలో (27,000) విద్యార్థులున్నారు. కిట్ నిధులు కిస్కు.. ఇంజనీరింగ్, మెడికల్‌తోపాటు పలు వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్న ‘కిట్’లో ఉన్నత ప్రమాణాల దృష్ట్యా ప్రవేశాలకు ఎంతో డిమాండ్ ఉంది. ఫీజులూ అదే స్థాయిలో ఉంటాయి. ‘కిట్’ లాభాలను ‘కిస్’నిర్వహణకు మళ్లిస్తూ, బోధన–బోధనేతర సిబ్బంది (3–7 శాతం వరకు స్వచ్ఛంగా) ఇచ్చే విరాళాలను, ఇతర వనరుల నుంచి లభించే నిధులతో ‘కిస్’ను నిర్వహిస్తున్నారు. ఏటా రూ.85 నుంచి రూ.95 కోట్ల నిర్వహణ వ్యయం ఉంటుందంటారు. ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన రూ.500 కోట్ల రుణంలో సగానికిపైగా మొత్తాన్ని మౌలికవసతుల కల్పనకు వెచ్చించారు. యూఎన్తో పాటు వివిధ ప్రపంచ, జాతీయ స్థాయి కంపెనీలు సహకారం అందిస్తున్నాయి. ఉదాహరణకు.. టాటాస్టీల్ సహకారంతో రూ.4.4 కోట్లు వెచ్చించి 150 సీట్ల లైబ్రరీ ఏర్పాటు చేశారు. తన జీవితమే పాఠమంటాడు నాలుగేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాక తల్లి, తనతో పాటు మరో నలుగురు పిల్లలతో బతుకు పోరు ప్రారంభించిన సామంత.. చిన్నతనంలోనే కష్టాల కడలి ఈదాడు. వెక్కిరించే పేదరికాన్ని చేతుల కష్టంతో ఎదురించాడు. బాగా చదువుకున్నాడు. ప్రొఫెసరయ్యాడు. తన కర్తవ్యాన్ని విభిన్నంగా ఆలోచించాడు. ‘కిట్’‘కిస్’లను అభివృద్ధి పరచిన పాతికేళ్ల ప్రస్తానంలో ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూశానంటారు సామంత. ఈ క్రమంలో ‘బ్యూరోక్రసీతో నా ప్రయోగాలు’ఓ పుస్తకమవుతుందంటారు. పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలి, అందుకు విద్య ఒక గొప్ప ఉపకరణం అంటారాయన. 2 లక్షల మంది గిరిజనుల్ని ‘కిస్’పరిధిలోకి తెచ్చే లక్ష్య సాధనకు ఒడిశాలోని 30 జిల్లాల్లో, కనీసం 10 రాష్ట్రాల్లో ‘కిస్’బ్రాంచీలు ఏర్పాటు చేస్తానంటారు. ప్రభుత్వాలు సహకరిస్తే గిరిజన జీవన స్థితిగతులు మార్చే సామాజిక పరివర్తన సుసాధ్యమంటారు. ఎంతో వినయంగా, నిబ్బరంగా ఉండే సామంత.. విజయ రహస్యం పూర్తిగా అర్థం కాలే దు. కానీ, ఇప్పటికీ సొంత బ్యాంక్ అకౌంట్ లేకుం డా, సొంత ఇల్లు లేకుండా, 2 గదుల అద్దె ఇంట్లో ఉంటూ అలవర్చుకున్న నిరాడంబర జీవన శైలి, నిస్వార్థ సేవ కూడా ప్రధాన కారణమే అనిపించింది. 10 వేల మంది దిగ్విజయంగా.. దేశ–విదేశాల అత్యున్నత హోదాల్లోని రాజ్యాంగాధినేతలు, నాయకులు, రాజనీతిజ్ఞులు, న్యాయమూర్తులు, సామాజిక వేత్తలతో పాటు 15 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు సందర్శించి, ప్రశంసించిన ఈ ప్రపంచ స్థాయి విద్యా సంస్థ మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉంది. ఒడిశాలోని అన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఈ యజ్ఞం పాతికేళ్లుగా సాగుతోంది. 62 గిరిజన ఉప (13 అతి ఆదిమ) జాతుల విద్యార్థులు ఇక్కడున్నారు. ఇప్పటివరకు 10,000 మంది ఈ విద్యాసంస్థ నుంచి దిగ్విజయంగా బయటకొచ్చారు. ఈ కృషికి కర్త, కర్మ, క్రియ అంతా.. 51 ఏళ్ల అవివాహితుడైన డాక్టర్ అచ్యుత్ సామంత. సంస్థ నిర్వహణ బాధ్యతలు ముఖ్యులకు అప్పగించి, ప్రస్తుతం ఫౌండర్ చైర్మన్ హోదాకే సామంత పరిమితమైనా అన్ని వ్యవహారాలూ ఆయన కనుసన్నల్లోనే సాగుతాయి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
వేల ఆకాశాల సూర్యుడు
ఒక ఆకాశం... ఒక సూర్యుడు... ఇంతవరకే మనం చూసింది. వేయి ఆకాశాలు... ఒక సూర్యుడు.. ఇప్పుడు మనం చూడబోతున్నది! ఒక్కో ఆశా ఒక్కో ఆకాశం అనుకుంటే వేల ఆకాశాలలో ప్రకాశిస్తున్న సూర్యుడు... అచ్యుత సామంత! సూర్యుడు జీవశక్తిని ప్రసాదిస్తున్నట్లే.. ఈ ఒడిశా సూర్యుడు... వేల మంది గిరిజన బాలబాలికలకు బతుకు శక్తిని ఇస్తున్నాడు. చేరదీసి, ‘చదువుముద్ద’ పెట్టి... ఆశయాల దారులు పరుస్తున్నాడు. గిరులలో వెన్నెల్లు కురిపిస్తున్నాడు. ఆ కుర్రాడికి అప్పటికింకా నాలుగేళ్లే. ఓ రోజు అమ్మ భోరున ఏడుస్తోంది. బంధుమిత్రులు ఓదారుస్తున్నారు. అన్న, అక్క చెల్లెళ్లు ఆరుగురూ బిత్తరపోయి చూస్తున్నారు. ఎదురుగా చలనం లేకుండా తండ్రి! ఏం జరుగుతోందో తెలియదు... ఏదో జరిగిందని మాత్రం తెలుస్తోంది. రోజులు గడిచాయి. అమ్మ పల్లెటూరికి చేరింది. తోబుట్టువులు ఒక్కొక్కరూ ఒక్కో బంధువు ఇంట్లో చేరిపోయారు. పూరి గుడిసెలో అమ్మ, తను, చిట్టి చెల్లెలు! అంతే! బడికి తీసుకెళతానన్న నాన్న ఎంతకీ రాడు. ఓ పూట తింటే ఇంకోపూట పస్తు... కట్టుకునే బట్ట అరకొరే. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి. ఈ పరిస్థితులే... అచ్యుత సామంత మనీషిగా ఎదిగేందుకు ప్రేరణయ్యాయి. ఆ సంకల్పం ఎంత బలమైందంటే... పాతికేళ్లు తిరక్కుండానే ఒడిశాలో చదువుకు అడ్రస్‌గా మారేంత! కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్... కుప్తంగా కిస్! మనలో చాలామంది ఈ పేరు కూడా విని ఉండం. కానీ ఈ దేశ రాష్ట్రపతులు మొదలుకొని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకూ... ముఖ్యమంత్రులు, దేశాధ్యక్షులు, సినీతారలు. క్రీడాకారులు... ఒక్కరనేమిటి... సమాజంలోని అన్ని వర్గాల వారికీ ఇప్పుడు ఇదో పర్యాటక స్థలం. చదువు అనేది పేదరిక నిర్మూలనకు ఎలా ఉపయోగపడుతుందో ఈ పాఠశాలను చూసి తెలుసుకోవాలని ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థ ప్రపంచానికి చెబుతోందంటే...ఈ పాఠశాల ప్రాముఖ్యత అర్థమవుతుంది. 1993– 94లో డాక్టర్ అచ్యుత సామంత స్థాపించిన ఈ విద్యాలయం ఎన్నో రకాలుగా ప్రత్యేకమైంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులున్న పాఠశాలగా రికార్డు సృష్టించింది ఇది. ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలోని దాదాపు 62 గిరిజన తెగల బాలబాలికలు ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకూ ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 80 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న కిస్ పూర్తిగా రెసిడెన్షియల్ కూడా. గిరిజన భాషల్లోనే ఓనమాలు నేర్పించడంతో మొదలయ్యే కిస్ విద్యాభ్యాసం ఆ తరువాత నెమ్మదిగా సంప్రదాయ క్లాస్‌రూమ్‌లకు మారుతుంది. ఇందుకోసం 62 గిరిజన తెగలకు చెందిన 18 భాషల్లో ప్రత్యేకమైన సిలబస్ సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కలలోనైనా ఊహించలేనన్ని సౌకర్యాలు. వేళకి ఇంత అన్నం వండిపెట్టేందుకు అత్యాధునిక సౌరశక్తి, విద్యాలయం మొత్తం వెలుగులు నింపేందుకు ఎల్ఈడీ బల్బులు, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రెండు ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి దీంట్లో. పిల్లలకు జబ్బు చేస్తే వైద్యమందించేందుకు 200 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పిల్లల మాసిన గుడ్డలు ఉతకడానికి అత్యాధునికమైన వాషింగ్ మెషీన్లు, డ్రయ్యర్లు ఉన్నాయి. ఇంకో విశేషం ఏమిటంటే... ఇక్కడ పిల్లలు తమ యూనిఫాం తామే కుట్టుకుంటారు. చదువు నేర్చుకుంటూనే... డబ్బులు సంపాదించుకునేందుకు కూడా కిస్‌లో ఏర్పాట్లు ఉన్నాయి. పచ్చళ్ల తయారీ, సంప్రదాయ గిరిజన కళలు... పెయింటింగ్, బొమ్మల తయారీ, వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇలా తయారైన వస్తువులను మార్కెట్లో విక్రయించి... వచ్చిన లాభాల్లో సగం పిల్లల ఖాతాల్లో జమవేస్తారు. ఆటలకీ, క్రీడలకీ అత్యాధునికమైన ఆటస్థలం, సదుపాయాలతో పాటు ఒక జూడో శిక్షణా విభాగం కూడా ఉంది. మొత్తం పాఠశాలకీ, హాస్టలుకీ అన్నిటికీ కలిపి 1087 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు ఉచితం... ఎలా సాధ్యమైంది? ఒకరా ఇద్దరా... దాదాపు పాతికవేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అంటే ఆషామాషీ కాదు కదా? బోలెడంత డబ్బు అవసరమవుతుంది. మరి అచ్యుత సామంత ఒక్కడే ఇంత మొత్తాన్ని ఎలా తెచ్చిపెట్టగలుగుతున్నాడు? అన్న ప్రశ్న వస్తే... కిస్ కంటే ఏడాది ముందు ప్రారంభమైన కళింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్టియ్రల్ టెక్నాలజీ... క్లుప్తంగా కిట్ గురించి చెప్పుకోవాలి. ఉత్కళ యూనివర్శిటీ నుంచి రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన తరువాత అచ్యుత సామంత కొన్నేళ్లపాటు ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. కట్టు పేదరికం నుంచి లెక్చరర్ స్థాయికి ఎదిగినా... జీవితం ఇక సాఫీగానే సాగిపోతుందని కచ్చితంగా తెలిసినా అచ్యుత సామంతలో ఏదో వెలితి. ఏదో చేయాలన్న తపన. ఈ ఆలోచనలతోనే చేతిలో ఉన్న ఐదువేల రూపాయల మొత్తంతో ఓ రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఆయన. వృత్తివిద్యా కోర్సులు నేర్పే కిట్ అందులోనే మొదలైంది. బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించడంతో బంధువులు, స్నేహితుల వద్ద చేబదుళ్లు తీసుకుని కీట్‌ను నడపటం మొదలుపెట్టాడు. ఒకదశలో రూ.15 లక్షల అప్పులు చెల్లించమని అందరూ ఒత్తిడి తీసుకువస్తే చచ్చిపోదామన్న ఆలోచన కూడా అచ్యుతలో మెదిలిందట. అయితే విధి చాలా బలీయమైందని అంటారు కదా... ఓ బ్యాంకు ఈయనకు పాతిక లక్షలు అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ తరువాత అచ్యుత వెనుదిరిగి చూసుకోలేదు. కిట్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకు తగ్గట్టుగానే కిట్ ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరింది. కిట్‌కు ఇప్పుడు 300 ఎకరాల విశాలమైన సొంత క్యాంపస్ ఉంది. దేశ విదేశాలకు చెందిన 25 వేల మంది విద్యార్థులిప్పుడు అక్కడ వేర్వేరు కోర్సులు చేస్తున్నారు. కిట్ విజయవంతం కావడం కిస్కు వరంగా మారింది. ఎందుకంటే కిట్‌లో వచ్చే ఫీజులో కొంతభాగం కిస్ ఫౌండేషన్‌కు వెళుతుంది. అంతేకాదు... ఇక్కడి బోధన, బోధనేతర సిబ్బంది కూడా తమ జీతాల్లోంచి నెలనెల మూడు శాతం మొత్తాన్ని కిస్ నిర్వహణ కోసం విరాళంగా అందజేస్తారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ తన వంతు సాయం అందిస్తూంటే... ఒడిశా ప్రభుత్వం నిరుపయోగంగా పడి ఉన్న ఇండస్టియ్రల్ ఎస్టేట్ భూముల్ని కీట్ క్యాంపస్ ఏర్పాటుకు ఇచ్చింది. కిట్... కిస్ రెండూ నా సంతానం.. అట్టడుగు వర్గాల పిల్లలకు విద్యనందివ్వడం... అంధుడికి చూపునివ్వడంతో సమానమని విశ్వసించే డాక్టర్ అచ్యుత సామంత తన జీవితాన్ని మొత్తం కిట్, కిస్ల కోసం ధారపోశాడంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. పెళ్లి చేసుకుంటే తన జీవితంలో కొంత సమయాన్ని కుటుంబం కోసం వెచ్చించాల్సి వస్తుందని అవివాహితుడిగానే మిగిలిపోయాడు. అంతేకాదు... తనకంటూ ఏ రకమైన ఆస్తిపాస్తులు ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే దాదాపు పదివేల కోట్ల రూపాయల విలువైన విద్యాసంస్థలకు అధిపతి అయినప్పటికీ అన్ని ఆస్తులు కిస్ ఫౌండేషన్ పేరుమీదే ఉన్నాయి. సంస్థ యజమానిగా అచ్యుత తీసుకుంటున్న గౌరవ వేతనం ఇప్పుడు నెలకు రూ.30 వేలు మాత్రమే. ఇప్పటికీ రెండు గదుల అద్దెఇంట్లో ఉంటున్నారు. అచ్యుత సామంతను మీ లక్ష్యమేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఇంకో మూడేళ్లలో అంటే 2020 నాటికి ఒడిశాలోని 30 జిల్లాల్లో 30 కిస్ శాఖలను, అలాగే దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కో కిస్ శాఖను స్థాపించాలంటారు. మరింత మంది గిరిపుత్రులను పేదరికం ఊబి నుంచి బయటకు తీసుకురావచ్చు... అంటారాయన. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా ఉప్పుడు బియ్యం చేసి... నూక తిన్నారు! డాక్టర్ అచ్యుత సామంత 1965లో జమ్షెడ్పూర్లో జన్మించారు. కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తండ్రి 1969లో ఓ రైలు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణం తరువాత తల్లి స్వగ్రామమైన కటక్ జిల్లా కలరాబంకా వెళ్లిపోయాడు. ఊరంతా తిరిగి ఎండుటాకులు ఏరుకు రావడం... మిగిలిన సమయాల్లో ఇరుగుపొరుగు పిల్లలతో కలిసి బలాదూరు తిరగడం ఇదీ చిన్నప్పటి అచ్యుత సామంత దినచర్య. ఒక రోజు స్కూల్ వద్ద గోల చేస్తూ ఆడుకుంటూంటే హెడ్మాస్టర్ చెవి మెలేశాడు. ఆనక అచ్యుత కుటుంబం పరిస్థితి తెలుసుకుని చలించిపోయాడు. స్కూల్లో చేరతావా? అని అడిగి పలక బలపం కొనిచ్చి అక్షరాలు దిద్దించాడు. సాయంత్రం ఇల్లిల్లూ తిరిగి వడ్లు సేకరించడం... వాటిని ఉప్పుడు బియ్యంగా మార్చడం మొదలుపెట్టాడు. ఈ శ్రమకు కొంత కూలీ దక్కేది. నూక రూపంలో ఇంట్లోకి తిండిగింజలూ చేరేవి. కష్టాలను ఎదుర్కొంటూ ఉత్కళ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చేశారు సామంత. ►1993– 94లో డాక్టర్ అచ్యుత సామంత స్థాపించిన ఈ విద్యాలయం... ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులున్న పాఠశాలగా రికార్డు సృష్టించింది. 62 గిరిజన తెగల బాలబాలికలు కేజీ నుంచి పీజీ వరకూ ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారు. ►ఇందులో గిరిజన భాషల్లోనే ఓనమాలు నేర్పిస్తారు. ఆ తరువాత నెమ్మదిగా సంప్రదాయ క్లాస్‌రూమ్‌లకు మారుతుంది. ఇందుకోసం 62 గిరిజన తెగలకు చెందిన 18 భాషల్లో ప్రత్యేకమైన సిలబస్ తయారు చేశారు. ►చదువుతోపాటు దుస్తులు కుట్టడం, పచ్చళ్ల తయారీ, పెయింటింగ్, బొమ్మల తయారీలో కూడా శిక్షణ ఇస్తారు. ►చేతిలో ఉన్న ఐదువేల రూపాయలతో రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుని కిట్‌ను ప్రారంభించారు. బంధువులు, స్నేహితుల వద్ద చేబదుళ్లు తీసుకుని కీట్‌ను నడపటం మొదలుపెట్టాడు. ►ఒకదశలో రూ.15 లక్షల అప్పులు చెల్లించాల్సిన ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నారు. అయితే విధి చాలా బలీయమైంది. ఓ బ్యాంకు పాతిక లక్షలు అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ తరువాత అచ్యుత వెనుదిరిగి చూసుకోలేదు.