తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రమోషన్
కోల్‌కతా: మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 7వ జాతీయ హోదా కలిగిన పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ ఎన్నికల కమిషన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం జాతీయ పార్టీ హోదా కల్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు జాతీయ పార్టీ హోదాలో కొనసాగుతున్నాయి. జాతీయ పార్టీ హోదా రావడంతో దేశంలో ఎక్కడి నుంచి అయినా తృణమూల్ కాంగ్రెస్ తమ పార్టీ గుర్తుతో పోటీ చేసే అవకాశం ఉంటుంది.
జాతీయ పార్టీ హోదా ఎందుకు ఇచ్చారంటే..
కనీసం 11 మంది ఎంపీలు లోక్‌సభలో ఉండి, అది కూడా కనీసం 3 రాష్ట్రాల నుంచి ఉంటేనే పార్టీకి జాతీయ హోదా వస్తుంది. లేదా.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో 6 శాతం ఓట్లు పొంది ఉండాలి, కనీసం 4 లోక్‌సభ స్థానాలు సాధించి ఉండాలి. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ హోదా ఉన్నా కూడా జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లలో రాష్ట్రస్థాయి పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ గుర్తింపుపొందింది. జాతీయ హోదా రావడానికి కావల్సిన చివరి నిబంధనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అర్హత సాధించడంతో జాతీయ ఎన్నికల కమిషన్ ఈ అవకాశం కల్పించింది.