ట్రిపుల్ తలాఖ్ అంటే... ఉరిశిక్ష లాంటిదే: సీజే
ముస్లిం పురుషులు తమ భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న ట్రిపుల్ తలాఖ్ పద్ధతి ఉరిశిక్ష లాంటిదేనని, అది ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాకపోయినా ఇప్పటికీ దాన్ని అమలుచేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో కోర్టుకు అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇది పాపమే గానీ చట్టబద్ధమని చెప్పినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఇలా వ్యాఖ్యానించారు. ఒకే సమయంలో మూడుసార్లు తలాఖ్ అనే పదాన్ని ఉచ్ఛరించడం ద్వారా ముస్లిం పురుషులు వైవాహిక బంధాన్ని తెంచేసుకునే పద్ధతిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రత్యేకంగా వేసవి సెలవులు కూడా రద్దు చేసుకుని మరీ పనిచేస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ట్రిపుల్ తలాఖ్ పద్ధతి వివక్షాపూరితమని, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేందిగా ఉందని వాదిస్తూ పలువురు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మతం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పిన విషయాన్ని చట్టం ఆమోదించగలదా అని సల్మాన్ ఖుర్షీద్‌ను జస్టిస్ కురియన్ జోసెఫ్ ప్రశ్నించారు. ట్రిపుల్ తలాఖ్ పద్ధతి మహిళల పట్ల వివక్ష చూపిస్తుందని, విడాకులు ఇచ్చేందుకు అందులో మహిళలకు సమానహక్కులు లేవని ముగ్గురు ముస్లిం మహిళల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ చెప్పారు. ఫోరమ్ ఫర్ అవేర్‌నెస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అనే సంస్థ తరఫున కూడా జెఠ్మలానీ తన వాదనలు వినిపించారు. ఒకే మతంలో ఉన్న పురుషులు, మహిళలకు పెళ్లి విషయంలో ఒకే తరహా నిబంధనలు ఉండాలని ఆయన అన్నారు. ఈనెల 19వ తేదీ నాటికల్లా ఈ కేసులో వాదనలు ముగించి, జూన్ నెలలో తీర్పు వెల్లడించాలని ధర్మాసనం భావిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో ఒక హిందూ, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, ఒక జొరాస్ట్రియన్ న్యాయమూర్తులు ఉన్నారు. ఇదే సందర్భంలో ముస్లిం మతంలో ఉన్న బహుభార్యత్వం, నిఖా హలాలా లాంటి ఆచారాలను కూడా తాము పరిశీలిస్తామని ధర్మాసనం చెప్పింది. ఈ మూడు ఆచారాలను కొట్టిపారేయాలని కొందరు పిటిషనర్లు కోర్టును కోరారు. భారతదేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, నిర్వహణ లాంటి అంశాల్లో ఒక్కో మతానికి ఒక్కో పర్సనల్ లా ఉంది.