ట్రిపుల్ తలాక్‌పై ఏమిటీ గందరగోళం
న్యూఢిల్లీ: ఉన్నఫలంగా ట్రిపుల్ తలాక్ ఇవ్వడం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుపై ఇప్పటికీ గందరగోళం నెలకొని ఉంది. తలాక్ ఏ అహ్‌సాన్, తలాక్ ఏ అసన్ అనే రెండు విధానాల కింద మూడు నెలల కాల వ్యవధిలో ముస్లిం మహిళలకు భర్తలు విడాకులు ఇవ్వొచ్చు. ఈలోగా భర్త మనసు మార్చుకుంటే విడాకుల ఆలోచన విరమించి తిరిగి ఏలు కోవచ్చు . ఇలాంటి సందర్భాల్లో కూడా మగవాడు మనసు మార్చుకోకపోతే మూడు నెలల కాల వ్యవధి తర్వాత భార్యకు విడుకులు ఇచ్చినట్లే లెక్క.
మరి భార్య అంగీకారంతో ప్రమేయంతోని సంబంధం లేని ఈ విడాకుల్లో కూడా మహిళల ప్రాథమిక హక్కులు దెబ్బతినవా? అంశంపై సుప్రీం కోర్టు ఎందుకు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ముస్లిం మగవాళ్లు తమ భార్యలకు మూడు విధాలుగా తలాక్‌లు ఇచ్చే పద్ధతి ఉంది. అందులో ఓ పద్ధతిని తలాక్ ఏ బద్దత్ అని పిలుస్తారు. ఈ పద్ధతిలో ఉన్న పళంగా తలాక్, తలాక్, తలాక్ అంటూ మూడు సార్లు ఉచ్ఛరించినా, లేఖ ద్వారా తలాక్ నామా పంపినా చెల్లుబాటు అవుతుంది. ఇటీవల కాలంలో ఫేస్‌బుక్ లేదా స్పీడ్‌పోస్ట్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో కూడా ట్రిపుల్ తలాక్‌లు పంపుతున్నారు. ఈ పద్ధతి ద్వారా తక్షణమే విడాకులు అమల్లోకి వస్తాయి. ఈ తక్షణ తలాక్ పద్ధతి చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
తలాక్ ఏ అహ్‌సాన్ పద్ధతి కింద భార్య రుతుక్రమంలో లేనప్పుడు భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పాలి. ఆమెకు మూడు నెలలపాటు కాల వ్యవధి ఇవ్వాలి. ఈ మూడు నెలలపాటు ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకోరాదు. ఆమె పోషణ భారం కూడా చూసుకోవాలి.
ఆమె గర్భవతి అయిన సందర్భంలో ప్రసవం వరకు నిరీక్షించాలి. ఈ సమయంలో ఇరు కుటుంబాల వారు భార్యభర్తలు విడిపోకుండా నచ్చచెప్పాలి. అప్పటికీ భర్త వినకపోతే విడాకులు మంజూరైనట్లే. తలాక్ ఏ అసన్ కింద కూడా భార్యకు తలాక్ చెప్పిన భర్త ఆమెకు మూడు నెలల కాల వ్యవధి ఇస్తారు. ప్రతి రుతుక్రమం రోజున ఆమె వద్దకు వెళ్లి మూడు నెలలపాటు తలాక్ చెప్పారు. ఈ విధానం కింద భార్యతోని లైంగిక సంబంధం పెట్టుకోరాదు. ఈ మూడు నెలల కాల వ్యవధిలో కూడా ఇరువురి కుటుంబాలు జోక్యం చేసుకొని భార్యాభర్తలకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తాయి. భర్త వినకపోతే విడాకులు మంజూరైనట్లే. వింటే తిరిగి భార్యను ఏలుకోవచ్చు. ఇక భార్యనే భర్తకు విడాకులిచ్చే పద్ధతిని కులాహ్ అంటారు. పెళ్లి సందర్భంగా అత్తంటి వారిచ్చిన నగలు, కానుకలు అన్ని వెనక్కి ఇచ్చేయాలి.
అప్పుడు కూడా విడాకులు తీసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని భర్త చెప్పినప్పుడే మౌల్వీలు భార్యలకు విడాకులు ఇప్పిస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మహిళల పట్ల వివక్షనే కొనసాగుతోంది. ఈ అన్ని విడాకుల విధానాల్లో కూడా భార్య అంగీకారంతో ఎవరికి పనిలేదు. ఇందులో అప్పటికప్పుడు విడాకులిచ్చే తలాక్ విధానాన్ని కొట్టి వేసిన మిగతా రెండు విధానాల జోలికి ఎందుకు వెళ్లలేదో తెలియదు.
ఇటీవలనే ట్రిపుల్ తలాక్‌తో విడాకులు తీసుకున్న తమకు సుప్రీం కోర్టు తీర్పు వర్తిస్తుందా, లేదా ? కొంత మంది ముస్లిం మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014లో తనకు పెళ్లయిందని, ఏడాదిలో ఆడ పిల్ల పుట్టిందని, కొడుకుకు బదులుగా కూతుర్ను ఎందుకు కన్నావంటూ తన భర్త వేధిస్తూ వచ్చాడని, ఇటీవల ఏకపక్షంగా తనకు తలాక్ నామా పంపించాడని, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తలాక్ చెల్లుతుందా, లేదా? మహారాష్ట్రలోని భివాండి పట్టణానికి చెందిన 28 ఏళ్ల గౌశ్య ప్రశ్నిస్తున్నారు.
2016, డిసెంబర్ నెలలో తన నుంచి ట్రిపుల్ తలాక్ ద్వారా తన భర్త విడాకులు తీసుకున్నారని, ఆయన దాదాపు తనను 20 ఏళ్లుగా గహ హింసకు గురిచేస్తూ రావడంతో తన భర్తపై గహ హింస కేసును పెట్టి న్యాయ పోరాటం జరపుతున్నానని ముంబైకి చెందిన జీనత్ షేక్ మీడియాకు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు వర్తిస్తుందా అని ఆమె కూడా ప్రశ్నిస్తున్నారు. తనకు విడాకులు తీసుకోవడం ఆనందంగానే ఉందని, అందుకు బదులుగా భర్త ఆస్తిలో తనకు కొంత వాటా రావాలని, ఇంతకాలం తనను హింసించినందుకు భర్తకు శిక్ష పడాలని ఆమె కోరుకుంటున్నారు.
ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పినందున సహజంగా గతం నుంచే అది వర్తించే అవకాశం ఉంటుంది. కొందరు ట్రిపుల్ తలాక్‌లు తీసుకున్న వారు ఇప్పటికీ మరో పెళ్లి చేసుకొని ఉండవచ్చు. మరికొందరికి భర్తతో తిరిగి కాపురం చేయడం ఇష్టం లేకపోవచ్చు. కొత్తగా ట్రిపుల్ తలాక్ తీసుకున్న వారు ఇప్పటికీ తర్జనభర్జనలు పడుతుండవచ్చు. అందుకని ట్రిపుల్ తలాక్ తీసుకున్న వారు ఎవరికి వారు ఈ విషయంలో కోర్టుకు వెళ్లి తేల్చుకోవడమే సమంజసంగా ఉంటుంది.
ఇక మిగతా రెండు రకాల తలాక్‌లను కూడా దష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం చట్టం తీసుకరావడం మంచిదంటూ సుప్రీం మైనారిటీ తీర్పు చెప్పినట్లుగా ఉంది. ఉమ్మడి పౌర స్మతి తీసుకరావడమే అన్ని సమస్యలకు పరిష్కారమని సుప్రీం తీర్పు అనంతరం బీజేపీ నాయకుడు సుబ్రమణియం స్వామి వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచన చేస్తోంది.