‘కంటోన్మెంట్ స్లమ్’లను మాకు అప్పగించండి
- కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరిన టీఆర్‌ఎస్ ఎంపీలు
- అప్పుడే పేద ప్రజలకు వసతులు కల్పించగలమని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న స్లమ్ ఏరియాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడానికి వీలుగా ఆ ప్రాంతంలోని భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీని టీఆర్‌ఎస్ ఎంపీలు కోరారు. బుధవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలుసుకున్న టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, జి.నగేష్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు భూమి బదలాయింపు వివరాలను సమర్పించారు. కంటోన్మెంట్ పరిధిలోని 9 ప్రాంతాలకు సంబంధించిన 16 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు.
ఈ ప్రాంతాల్లో పేద ప్రజలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, అవి కూలిపోతే మరమ్మతులు చేసుకోవడానికి డిఫెన్స్ అధికారులు అనుమతులు ఇవ్వడంలేదని తెలిపారు. ఆ భూములను బదలాయిస్తే మరో ప్రాంతంలో భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. అలాగే బైసన్‌పోలో గ్రౌండ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఈ విషయంలో ఇప్పటికే ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగిన నేపథ్యంలో వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ఎంపీలు కోరారు.
గ్రానైట్‌పై జీఎస్టీ మినహాయింపును పరిశీలిస్తాం..
జీఎస్టీతో తీవ్ర ప్రభావానికి గురయ్యే చిన్న, మధ్యతరహా గ్రానైట్ పరిశ్రమలపై పన్ను మినహాయింపును పరిశీలిస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చినట్టు ఎంపీలు తెలిపారు. జీఎస్టీ వల్ల గ్రానైట్ పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘాల నేతలు అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రానైట్ పరిశ్రమలపై ఐదు శాతం పన్ను విధించాలని చేసిన విజ్ఞప్తిపై జైట్లీ సానుకూలంగా స్పందించినట్టు పొంగులేటి తెలిపారు.
అటవీ అనుమతులు మంజూరు చేయండి..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అటవీ అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ఎంపీలు కోరారు. కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలుసుకున్న ఎంపీలు ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ భూముల బదలాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.