జాతిపిత మహాత్మాగాంధీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ ఈ రోజు అంటే, 1948, జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే అనే ఆరెస్సెస్ కార్యకర్త హత్య చేశారనే వార్తను ఆకాశవాణిలో ప్రకటించినప్పుడు అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆకాశవాణిలో మాట్లాడుతూ ‘మన జీవితాల నుంచి ఓ దివ్య జ్యోతి వెళ్లిపోయింది. అంతటా చీకట్లు కమ్ముకున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఫిబ్రవరి 2వ తేదీన రాజ్యాంగ పరిషత్‌లో నెహ్రూ, గాంధీ గురించి అద్భుతంగా మాట్లాడారు.
‘ఆయన జీవితానికి ఓ పిచ్చోడు ముగింపు పలికాడు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ ఆ వ్యక్తిని నేను పిచ్చోడనే సంబోధిస్తా. గత కొన్ని ఏళ్లుగా, నెలలుగా దేశంలో విషం వ్యాపించింది. అది ప్రజల మెదళ్లను కూడా ప్రభావితం చేస్తోంది. ఆ విషాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. దాన్ని నామరూపాలు లేకుండా చేయాల్సిందే. పిచ్చిగానో, చెడుగానో దాన్ని అంతం చేయాలనుకోవడం పొరపాటు. మనల్ని వీడిపోయిన మన ప్రియతమ టీచరు దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పాడో, అచ్చం అలాగే ఎదుర్కోవాలి’..........ఆకాశవాణిలో నెహ్రూ.
‘పోయిన ప్రముఖులకు నివాళి అర్పించడం సభలో ఆనవాయితో కావచ్చు. ఈ సందర్భంగా ఈ సభలో నేనుగానీ, ఇతరులుగానీ ఎక్కువ మాట్లాడటం సబబు కాకపోవచ్చు. నేను మాత్రం ఓ వ్యక్తిగా, ప్రభుత్వాధినేతగా సిగ్గుపడుతున్నాను. అమూల్యమైన సంపదను పరిరక్షించుకోవడంలో మనం విఫలమయ్యాం. గత కొన్ని నెలలుగా అనేక మంది అమాయకులు, మహిళలు, పిల్లలను రక్షించుకోవడంలో విఫలమవుతూ వస్తున్నాం. ఈ రోజు ఎంతో గొప్ప వ్యక్తిని రక్షించుకోలేకపోయామంటే అంతకన్నా సిగ్గుచేటు మనకు మరోటి లేదు.
ఓ భారతీయుడు ఆయనపైకి చెయ్యెత్తినందుకు ఓ భారతీయుడిలా నేను సిగ్గుపడుతున్నాను. ఓ హిందువు ఆ పని చేసినందుకు ఓ హిందువుగా నేను సిగ్గుపడుతున్నాను. నిజంగా ఆ మహానుభావుడు ఎంతో బాధ పడి ఉంటారు. ఆయన బోధనా మార్గంలో నడవాల్సిన ఈ తరమే విఫలమైనందుకు ఆయన బాధ పడి ఉంటారు. ఆయన చూపిన మార్గాన్ని కాదని మరో మార్గాన మనం నడుస్తున్నందుకు ఆయన బాధ పడి ఉంటారు. ఆయన చేతులు పట్టుకున్న పిల్లాడి చేతులే ఆయన్ని పంపించినందుకు ఆయన బాధ పడి ఉంటారు.’ రాజ్యాంగ పరిషత్’ సభలో జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంలోని ఓ భాగాన్ని గాంధీకి నివాళిగా ఇక్కడ ఇస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment