శశికళ, దినకరన్‌లపై వేటు
► సీఎం పళని నిర్ణయం
► పార్టీ భేటీకి 30 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి.తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సీఎం పళని స్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో నిర్ణయించారు.
వారి అధీనంలోని నమదు ఎంజీఆర్ దినపత్రిక, జయ టీవీని స్వాధీనం చేసుకోవాలని, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు వచ్చేనెల 12న పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ భేటీకి 113 మంది ఎమ్మెల్యేలకుగానూ 83 మంది మాత్రమే హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని ఎన్నికల సం ఘం గుర్తించలేదని, అందువల్ల ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం చెల్లదని పళని చెప్పారు.
ఢిల్లీకి పళని, దినకరన్ వర్గాలు
సీఎం పళని, దినకరన్ వర్గాల పంచాయతీ ఢిల్లీకి చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేందుకు సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఐదుగురితో కూడిన మంత్రుల బృందం మంగళవారం ఈసీని కలవనుంది. పళని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు మంగళవారం రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, జూలై 18న అసెంబ్లీలో నిషేధిత గుట్కాల్ని ప్రదర్శిం చారంటూ ప్రతిపక్ష నేత స్టాలిన్ సహా 21 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల్ని జారీచేశారు.