నటుడి ఆత్మహత్య: టీవీ నటి అరెస్ట్
ఒడిషాలోని పాపులర్ టీవీ నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్సీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సహనటుడి ఆత్మహత్యకు ప్రేరేపించిందన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరో టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ అలియాస్ రాజా అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.
ఫిబ్రవరి 6న ఏర్పాటుచేసిన ఒక సంగీత కార్యక్రమంలో టీవీ నటులు జెస్పీ, చందన్ పాల్గొనాల్సి ఉంది. రాజాను పిలవకపోయినా అతడు ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే అసలు వెళ్లాల్సిన చందన్ మాత్రం గైర్హాజరయ్యాడు. దీంతో నిర్వాహకుల అభ్యర్థన మేరకు రాజా షో లో పాల్గొన్నాడు. షో ముగిసిన తరువాత రాజాకు రూ. 2వేలు, జెస్సీకి రూ. 27,000 చెల్లించడంతో గొడవ మొదలైంది.
ఇద్దరు కారులో వెడుతుండగా వివాదం మరింత ముదిరింది. రాజాను అవహేళన చేసిన జెస్సీ.. అతడిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీన్ని అవమానంగా భావించిన అతను డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి వంతెన పిట్టగోడ మీద నుంచి దూకేశాడు. దీనిపై రాజా బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం, ప్రొఫెషనల్ విభేదాలే ఘర్షణకు కారణమని ఎస్పీ నితిశేఖర్ మీడియాకు తెలిపారు. జెస్సీతో పాటుఈవెంట్ కో ఆర్డినేటర్ ప్రాలే జెనా, డ్రైవర్ ధానేశ్వర్‌లకు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించామని ఎస్పీ తెలిపారు.