
ఒక్క ట్వీట్ తో వచ్చేసింది!
ఒక్క ట్వీట్ తో ఆ ఊరికి పోస్టాఫీస్ వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కలగానే మిగిలిన తపాలా కార్యాలయం ఎట్టకేలకు సిద్ధించింది.
న్యూఢిల్లీ: ఒక్క ట్వీట్ తో ఆ ఊరికి పోస్టాఫీస్ వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కలగానే మిగిలిన తపాలా కార్యాలయం ఎట్టకేలకు సిద్ధించింది. ఆ ఊరి పేరు భనోలి సెరా. భారత్-చైనా సరిహద్దుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ పితోరాగఢ్ జిల్లాలో ఉన్న ఈ గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు అంతంతమాత్రమే.
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లు అవుతున్నా భనోలి సెరా గ్రామంలో పోస్టాఫీస్ లో లేదు. సమాచార వ్యవస్థలో అందుబాటులో లేకపోవడంతో ఈ గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నిఇన్ని కావు. సమాచారం ఆలస్యంగా చేరడంతో ఉద్యోగావకాశాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. తమ ఊరిలో పోస్టాఫీస్ ఉంటే ఇలాంటి బాధలు తప్పేవని గ్రామస్థులు భావించారు.
ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్విటర్ ద్వారా కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ దృష్టిని తీసుకొచ్చారు. వెంటనే స్సందించిన మంత్రి నాలుగు రోజుల్లో భనోలి సెరా గ్రామంలో పోస్టాఫీస్ ఏర్పాటు చేయించారు. తాత్కాలిక గదిలో పోస్టాఫీస్ కార్యాకలపాలు ప్రారంభమయ్యాయి. తమ ఊరికి పోస్టాఫీస్ రావడంతో భనోలి సెరా గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
Getting @rsprasad to respond to Ukhand village plea for post office is healthy sign. We should use social media to connect on real issues.
— Rajdeep Sardesai (@sardesairajdeep) June 21, 2016