సాక్షి, న్యూఢిల్లీ: మండుటెండలను కూడా లెక్కచేయకుండా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విస్తతంగా ప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పాపం! వడ దెబ్బ తగిలినట్లుంది. మెదడు పనిచేయట్లేదనుకుంటా! చరిత్రకు సంబంధించి ఏవో అవాకులు, చెవాకులు చెబుతున్నారు. అవి విన్నవాళ్లు అవాక్కవడమే కాదు, పిచ్చెక్కి జుట్టు పీక్కుంటున్నారు. ‘అరే, మోదీ గారికి చరిత్రను సరిగ్గా చెప్పే మాస్టారుని వెతకండ్రా!’ అంటూ కొందరు తిరుగుతున్నారు. కొందరేమో ఇలా....ట్వీట్ల మీద ట్వీట్లు విసురుతున్నారు.
‘రాజకీయాల కోసం చరిత్రను అడ్డదిడ్డంగా వక్రీకరించకండి, జైల్లో భగత్ సింగ్, ఆయన అనుచరులను నెహ్రూ కలుసుకోవడమే కాదు. ఆ తర్వాత వారి గురించి తన రచనల్లో పేర్కొన్నారు కూడా.........ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు! దయచేసి మమ్మల్ని ఇంకా ఇలా ఇబ్బంది పెట్టకండీ, తట్టుకోలేకపోతున్నాం. అయినా ఇది మీ తప్పుకాదు లెండీ, మీ పరిశోధక బందం పనితీరు అలా ఉందండీ, నెహ్రూ 1929, జూన్ లేదా ఆగస్టులో లాహోర్ జైలులో భగత్ సింగ్‌ను కలుసుకున్నారు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను........రాహుల్ గాంధీ భారత దేశ స్వాతంత్య్ర యోధుడు భగత్ సింగ్‌ను కలుసుకోకుండా జైల్లో ఉన్న లాలూను కలుసుకోవడం ఏమిటీ? అన్నది మీ ప్రశ్నగదా! ఎవరికి అర్థం కావండం లేదు.......అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పుట్టుకొస్తున్నాయి.
‘దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ జైలుకెళ్లిన భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్లను జైల్లో ఏ కాంగ్రెస్ నాయకుడైనా వెళ్లి కలుసుకున్నారా? జైలుకెళ్లిన అవినీతిపరులను మాత్రం కలుసుకోవడానికి వారికి సమయం కుదురుతుంది. అంటే కాంగ్రెస్ అవినీతిపరులనే సమర్థిస్తుంది. నేను అనుమతించను’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం కర్ణాటకలోని బీదర్‌లో మాట్లాడుతూ లాలూను రాహుల్ కలుసుకోవడంపై ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ వెబ్‌సైట్లో కూడా ఈ వ్యాఖ్యలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి. నెహ్రూ, భగత్ సింగ్, ఆయన అనుచరులను కలుసుకోవడమే కాకుండా వారి గురించి ‘సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ వాల్యూమ్–4’ రాశారు. కాంగ్రెస్ నాయకుడు కూడా అయిన న్యాయవాది అసఫ్ అలీ, భగత్ సింగ్ తరఫున వాదించారు. అయినా లాభం లేకపోయింది. 1931, మార్చి 23న భగత్‌ను ఉరితీశారు. హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌ను స్వాతంత్య్ర యోధునిగా కూడా మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి ఆయన పుస్తకాలు రాశారు తప్ప, ప్రత్యక్షంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న దాఖలాలు లేవు.
నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ‘జైల్లో ఉన్న భగత్ సింగ్‌ను కాంగ్రెస్ నాయకులు కలుసుకున్నారు. భగత్ తరఫున వాదించిన న్యాయవాది కూడా కాంగ్రెస్ నాయకుడే. నీవాళ్లెవరో నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. యడ్యూరప్పను, గాలి సోదరులను మాత్రం కాంగ్రెస్ నాయకులు కలుసుకోలేదు. అది మాత్రం వాస్తవం. అవాకులు, చెవాకులు పేలే ముందు వాస్తవాలు తెలుసుకో!’ అని ట్వీట్ చేసింది.
దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనుభవం ఆరెస్సెస్‌కు లేకపోవడం వల్ల మోదీకి వాస్తవాలు తెలియడం లేదు.....
జైల్లో ఉన్న భగత్ సింగ్‌ను కాంగ్రెస్ ఎందుకు కలుసుకోలేదు? ఎం. కృష్ణన్ మీనన్‌ను నెహ్రూ ఎందుకు అవమానించారు? పటేల్‌ను కాంగ్రెస్ ఎందుకు పీఎంను చేయలేదు?
అంబేద్కర్‌కు వ్యతిరేకంగా నెహ్రూ ఎందుకు ప్రచారం చేశారు?–నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు 1952......
భగత్ సింగ్‌ను కలుసుకునేందుకు లాహోర్ జైల్లోకి నెహ్రూ జొరబడ్డారంటే, కర్ణాటక ఎన్నికల్లో మోదీని ఓడించడానికి పాక్‌తో కలిసి కుట్ర పన్నడమే......అంటూ ట్వీట్లు పేలుతూనే ఉన్నాయి.
అదేమోగానీ మొదటి నుంచి నరేంద్ర మోదీ చరిత్రకు సంబంధించి అంశాలను తప్పుగానే చెబుతున్నారు. మొన్నటికి మొన్ను కరియప్ప, తిమ్మయ్యల గురించి తప్పుగా మాట్లాడినా ఆయన ఆ మధ్య కోణార్క్ దేవాలయాన్ని సందర్శించినప్పుడు దాన్ని రెండువేల ఏళ్ల క్రితమే నిర్మించారని చెప్పారు. వాస్తవానికి దాన్ని 13 శతాబ్దంలో నిర్మించారు. కోణార్క్‌పై విగ్రహాలను చూస్తూ మన శిల్పకారులు ఆనాడే ఆధునిక మహిళ వేసుకునే స్కర్టు, హ్యాండ్ బ్యాగ్‌లను ఊహించి శిల్పాలు చెక్కారని తెగ మెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ విగ్రహాలకు వస్త్రాలే లేవు. అక్కడ అచ్చాదనగా ధరించిన నగల వరుసను చూసి మోదీ భ్రమపడ్డారు.
2014, ఫిబ్రవరిలో కూడా మోదీ ఓసారి భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ అండమాన్, నికోబార్‌లోని సెల్యూలార్ జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. కానీ ఆయన తొలుత ఢిల్లీ జైలులో, ఆ తర్వాత లాహోర్ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment