సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలపై సోషల్ మీడియా తనదైన రీతిలో స్పందిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై భారీగా చలాన్లను పెంచడాన్ని తీవ్రంగా దూషిస్తోంది. చలాన్లను చెల్లించిన తర్వాత రోడ్డుపై అడుక్కుతినాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఒకరు బాలీవుడ్ చిత్రం ‘సంజూ’లో రణీబీర్ కపూర్ రోడ్డుపై అడుక్కుంటున్న దృశ్యాన్ని పోస్ట్ చేశారు. అప్పటి వరకు జల్సాగా రోడ్లపై బలాదూర్ తిరిగిన ఓ యువకుడు ట్రాఫిక్ చలాన్లను చెల్లించాక బస్టాండ్‌లో వచ్చిపోయే బస్సుల వెంట తిరిగుతూ నూనె డబ్బులు అమ్ముతున్న దశ్యం అంటూ మరో బాలీవుడ్ చిత్రంలోనే ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు రుణాల కోసం బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలంటూ తమదైన శైలిలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.
చదవండి: ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు
ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు భారీగా పడిపోవడానికి కారణం యూత్ కొత్త కార్ల కొనుగోలుకు మొగ్గుచూపకుండా ఊబర్, ఓలా క్యాబ్‌ల పట్ల ఆకర్షితులవడమేనంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు వదిలి పెట్టలేదు. ఇంతకుముందు సంగతేమోగానీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పెంచిన చలాన్లు అమల్లోకి వస్తాయని ప్రకటించిన నాటి నుంచి వాహనాల కొనుగోలు భయంకరంగా పడిపోయిందని పలువురు సెటైర్లు వేశారు. రోడ్లు, ట్రాఫిక్ లైన్లు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అందుకు భారీ వడ్డింపులే మార్గమని ఆలోచిస్తే బాగుండేదని కూడా సోషల్ మీడియా యూజర్లు సూచిస్తున్నారు.
రోడ్డుపై ఎన్ని గుంతలు ఉంటే గుంతకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున మున్సిపాలిటీకి, తెల్లటి, నల్లటి ట్రాఫిక్ చారికల్ సవ్యంగా లేకపోతే లైన్‌కు ఐదు వందల రూపాయల చొప్పున ట్రాఫిక్ విభాగానికి ముందుగా చలాన్లు విధించండని, ఆ తర్వాతనే వాహనదారుల జోలికి రావడమే సమంజసమని పలువురు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment