అరుదైన సర్జరీతో ఇద్దరికి చూపు
చెన్నై అగర్వాల్ నేత్రాలయం వైద్యుల ఘనత
సాక్షి, చెన్నై: పీడెక్ అనే అత్యంత అరుదైన నేత్ర శస్త్రచికిత్సను చెన్నైలోని అగర్వాల్ నేత్రాలయం డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. ఇద్దరు వృద్ధులకు కంటిచూపు ప్రసాదించారు. ప్రపంచంలో మొదటిసారిగా ఈ శస్త్రచికిత్స ను నిర్వహించినట్లు డాక్టర్ అమర్ అగర్వాల్ చెప్పారు. రోగి కార్నియాను మార్చకుండా కంటిలోని ఎండోధిలియం పొరను ‘డువా’ అనే అతి సూక్ష్మమైన పొరతో తొలగించే ఈ వినూత్నమైన శస్త్ర చికిత్సనే పీడెక్ అంటారని తెలిపారు.
ఏడాది వయసులో మృతిచెందిన బాలుడి కంటిలోని డువా పొరను తొలగించి చెన్నై ఆవడికి చెందిన షణ్ముగం అనే వ్యక్తికి, కోడంబాక్కంకు చెందిన విశాలాక్షికి పీడెక్ సర్జరీ చేసి కంటిచూపు తెప్పించామన్నారు. గత రెండు నెలలలో 16 పీడెక్ చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. వయసుతో పాటు వచ్చే నేత్రలోపాలకు మాత్రమే పీడెక్ విధానం పనికి వస్తుందన్నారు. ఈ శస్త్ర చికిత్సకు 25 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు.