టూ మినిట్స్... | two minutes magi noodles controversy | Sakshi
Sakshi News home page

టూ మినిట్స్...

Published Thu, Jun 4 2015 11:26 AM | Last Updated on Mon, Oct 8 2018 4:21 PM

టూ మినిట్స్... - Sakshi

టూ మినిట్స్...

(వెబ్ సైట్ ప్రత్యేకం)

టూ మినిట్స్ మాగీ నూడుల్స్ అంటూ  రెండో ఆలోచన  రానివ్వకుండా, జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన  మాగీ నూడుల్స్కు  దేశవ్యాప్తంగా  ప్రజలు బానిసలుగా  మారిపోయారంటే అతిశయోక్తి కాదు.  బద్ధకంగా  ఉన్నా, ఓపిక లేకపోయినా అప్పటికపుడు ఏదైనా తినాలనిపించినా ఠక్కున గుర్తొచ్చే ది మ్యాగీ నూడుల్స్.

అంతలా  మ్యాగీ నూడుల్స్  మహిళలు, పిల్లల జీవితాలతో మమేకమై పోయింది.  అలాంటి  ఆ ప్యాకెట్ ఇపుడు  విషమైపోయిందని తెలిసి నివ్వెరపోతున్నారు.  సీసం మోతాదు ఎక్కువైందని,  చిన్నారులకు ప్రాణాలకు తీవ్ర హాని కలిగించేంత ప్రాణాంతకంగా మారే ప్రమాదముందన్న అధికారుల హెచ్చరికలతో మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే ఇండియా లిమిటెడ్ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.

యూపీలో రగిలిన ఈ రగడ దేశంలోని చాలా రాష్ట్రాలకు పాకుతోంది.  యూపీ, కేరళ రాష్ట్రాల్లో నిషేధించారు.  ఢిల్లీ సర్కార్ 15 రోజులపాటు మ్యాగీని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.  ఇప్పటికే కేరళ, యూపీలోనూ ఈ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాల్సిందిగా నెస్లే ఇండియాను అధికారులు ఆదేశించారు. ఇంకా  పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తాజాగా అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ  మ్యాగీ  శ్యాంపిళ్ల పరీక్షలు మొదలయ్యాయి.

తెలంగాణా ప్రభుత్వం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంటులో పరీక్షలు  చేయిస్తోంది. మరోవైపు దీనిపై కొత్త  చట్టం చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి  రాం విలాశ్   పాశ్వాన్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన మ్యాగీ  శ్యాంపిళ్ల ఫలితాలపై ఫుడ్ సేఫ్టీ అండ్  స్టాండర్డ్స్ అథారటీ  ఆఫ్  ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఐ) నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ప్రకటించారు. అలాగే  ఎన్సీడీఆర్సీ( నేషనల్ కన్జ్యూమర్ రెడస్సల్ కమిటీ)లో ఫిర్యాదు చేయడానికి కేంద్రం సన్నద్ధమౌతోంది.

సాధారణంగా వినియోగదారులు ఫిర్యాదులను విచారించే ఎన్సీడీఆర్సీ, 1986 చట్టం, సెక్షన్ 12-1-D    ప్రకారం ప్రభుత్వ ఫిర్యాదులను కూడా స్వీకరిస్తుంది.  దీని ప్రకారం నేరం రుజువైతే 5 లక్షల జరిమానాతో పాటు ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడొచ్చు. అంతేకాదు జైలు శిక్ష  ఏడేళ్లతో పాటు, జరిమానా 10 లక్షలకు పెరిగే అవకాశం ఉంది.

ఈ వివాదం ముగియకముందే ఇదే సంస్థకు (నెస్లే)  చెందిన పాల  పొడిలో పురుగులు ఉన్నాయన్న వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది. తన 18 నెలల పసిపాప కోసం కొన్న పాలపొడిలో  పురుగులను గమనించి షాకైన తమిళనాడుకు చెందిన ఓ వినియోగదారుడు కోయంబత్తూరులో  ఫిర్యాదు చేశాడు.  పాలపొడిలో అండదశలో ఉన్న సజీవ లార్వా ఉన్నాయన్న వార్తలు జనం గుండెల్లో గుబులు  పుట్టిస్తున్నాయి. దీంతో నెస్లే ఇండియా కంపెనీ రూపొందిస్తున్న ఆహార ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి.  

పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ దుష్పరిణామాలను మ్యాగీ వివాదం..మరోసారి వెలుగులోకి  తెచ్చినట్లు అయ్యింది. ఫాస్ట్ఫుడ్ను ఆరగించే ముందు మనం కూడా రెండు నిమిషాలు ఆగి ఆలోచించక తప్పని స్థితి. మరోవైపు ఈ వివాదంలో  బాలీవుడు నటులు న్యాయపరమైన  చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా 'దో బూంద్ ..' లాంటి పోలియో నివారణ ప్రచార ప్రకటనతో ఆకట్టుకున్న బిగ్ బి అమితాబ్ కూడా ఈ వివాదంలో   ఇరుక్కున్నారు. ఇక ముందు ఇలాంటి ప్రకటనలకు  ఒప్పుకునే ముందు కచ్చితంగా నటులు,   సెలబ్రిటీలు  'రెండు నిమిషాలు*  ఆలోచించు కోవాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement