విద్యార్థులందరికీ ట్యాబ్‌లు
ఉద్ధవ్‌ఠాక్రే ఎన్నికల హామీ
సాక్షి, ముంబై: ఢిల్లీ ఆడమన్నట్లు ఆడే ప్రభుత్వం రాష్ట్రంలో వద్దని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ధులే జిల్లాలోని పారోలా రోడ్డుపైగల శివాజీ విగ్రహం వద్ద సోమవారం ఉద్ధవ్ ప్రచార సభ జరిగింది. ప్రచారానికి సోమవారం ఆఖరురోజు కావడంతో ఉద్ధవ్‌కు తగినంత సమయం దొరకలేదు. దీంతో శివాజీ విగ్రహం వద్ద జిల్లాలోని ఐదు శాసనసభ నియోజక వర్గాల సభ్యులకు మద్దతుగా అక్కడే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎగుమతులకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని దుయ్యబట్టారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అందరం కలిసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని, అయితే ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన వి కావడంతో ఇక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉందని అన్నారు. శివసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులందరికి ట్యాబ్, మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, అందుకు జిల్లా ఆరోగ్య కేంద్రాలన్నింటిని అనుసంధానిస్తామని తెలిపారు. రైతులకు తగినన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.