Shiv Sena president Uddhav Thackeray
-
శివసేనకు కడుపు మంట
సాక్షి, ముంబై: అధికారంలో ఉంటూ మిత్రపక్షంపై విమర్శలు చేయడం మానుకోవాలని బీజేపీ ప్రదేశ్ నూతన అధ్యక్షుడు రావ్‌సాహెబ్ దానవే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు హితవు పలికారు. ఓ మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో బీజేపీ నాయకుడు కొనసాగడం శివసేనకు కడుపు మంటగా ఉందని చురకలంటించారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ తరుచూ ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పించడం ప్రజలకు నచ్చదన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సేనను పరోక్షంగా హెచ్చరించారు. తమకు తగినంత సంఖ్యా బలం లేదని, అధికారం లేకుంటే శివసేన నాయకులకు మనసు స్థిరంగా ఉండదని, దీని కారణంగానే ఇరుపార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. ఇకనైన బీజేపీపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అన్ని శాఖలు ప్రధానమైనవే ఇరుపార్టీల ఓటర్లు ఒక్కటేనని, అధికారం కోసం ఇతర పార్టీల మద్దతు తీసుకుంటే వారి మనోభావాలు దెబ్బ తీసినట్లవుతుందని అన్నారు. బీజేపీ ప్రతిపాదనలు శివసేన వ్యతిరేకించడంవల్ల రెండు పార్టీల్లో సంయమనం, ఐక్యత కొరవడిందనే భావన ప్రజల్లో నాటుకుపోతుందన్నారు. ప్రాధాన్యత లేని శాఖలు తమకు అంటగట్టారని శివసేన ఆసంతృప్తి వ్యక్తం చేయడంపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో అన్ని శాఖలకు ప్రాధాన్యత ఉంటుందని, తప్పుగా భావించడం సరి కాదన్నారు. దానవేను ప్రదేశ్ అధ్యక్షునిగా నియమించడంతో మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆహార, సార్వజనిక పంపిణీ, వినయోగదారుల వ్యవహారాల శాఖకు సహాయ మంత్రిగా ఉన్నారు. -
ఢిల్లీలో ఆప్ విజయంపై ఉద్ధవ్ వ్యాఖ్య
సాక్షి, ముంబై: ఢిల్లీలో బీజేపీ పరాజయానికి కిరణ్ బేడీ కాకుండా మోదీయే కారణమన్న అన్నా హజారే వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పరుషంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘లాటేపేక్షా సునామి మోటీ అస్తే’ (అలల కంటే సునామి ప్రభావం అధికంగా ఉంటుంది) అని ఢిల్లీ ప్రజలు నిరూపించారంటూ మోదీని ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలు నరేంద్ర మోదీకి పరాజయం అని పేర్కొనడం తప్పు కాదన్నారు. దేశమంతా మోదీ అలలు ఊపేస్తున్నాయన్న చర్చ జరిగిందని, కానీ ఢిల్లీ ప్రజలు అలల కన్నా సునామీ గొప్పదని నిరూపించారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షలు అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్ధవ్ ఠాక్రే ఫోన్లో అభినందించారు. ఢిల్లీలోని ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లు, ఆశలకు లొంగకుండా కావల్సిన వారికే పట్టంకట్టారని బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న భావన శివసేన కార్యకర్తల్లో నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా 18 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ప్రమాణ స్వీకారోత్సవాలకు వెళ్తాను..! ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందితే తప్పకుండా వెళతానని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. తాను కేజ్రీవాల్‌తో మాట్లాడి అభినందించానని చెప్పారు. ఢిల్లీ కోసం పని చేయాలని చెప్పానని, సీఎం పదవి నుంచి రాజీనామా చేసే తప్పిదం మరోసారి చేయకూడదని కూడా సూచించానని తెలిపారు. బీజేపీ ముక్త్ భారత్ యాత్ర ప్రారంభమైంది ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ముక్త్ భారత్ యాత్ర (బీజేపీ లేని దేశం) ప్రారంభమైందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. బీజేపీ అహంకారానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఓ చెంపపెట్టుగా ఉందన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసే బీజేపీని ప్రజలు తిరస్కరించడం ప్రారంభించారని చెప్పారు. మరోవైపు ఢిల్లీలో ఘనవిజయం సాధించిన ఆప్ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి ప్రజలు బుద్దిచెప్పారు తమకు తిరుగులేదన్న అహంకారంతో ముందుకు వెళ్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధిచెప్పారని ఎన్సీపీ నాయకుడు ధనంజయ్ ముండే పేర్కొన్నారు. అధికారంలో ఉన్న రూ. 10 లక్షల సూట్‌పై వంద రూపాయల సామాన్యుని మఫ్లర్ గెలిచిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ధనంజయ్ ముండే విలేకరులతో మాట్లాడారు. లోకసభ ఎన్నికల అనంతరం జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ లభించింది. దీంతో బీజేపీ నాయకులకు అహంకారం, గర్వం పెరిగిపోయింది. దీన్ని గమనించిన సామాన్య ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పారని ఆయన పేర్కొన్నారు. -
విద్యార్థులందరికీ ట్యాబ్‌లు
ఉద్ధవ్‌ఠాక్రే ఎన్నికల హామీ సాక్షి, ముంబై: ఢిల్లీ ఆడమన్నట్లు ఆడే ప్రభుత్వం రాష్ట్రంలో వద్దని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ధులే జిల్లాలోని పారోలా రోడ్డుపైగల శివాజీ విగ్రహం వద్ద సోమవారం ఉద్ధవ్ ప్రచార సభ జరిగింది. ప్రచారానికి సోమవారం ఆఖరురోజు కావడంతో ఉద్ధవ్‌కు తగినంత సమయం దొరకలేదు. దీంతో శివాజీ విగ్రహం వద్ద జిల్లాలోని ఐదు శాసనసభ నియోజక వర్గాల సభ్యులకు మద్దతుగా అక్కడే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎగుమతులకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అందరం కలిసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని, అయితే ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన వి కావడంతో ఇక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉందని అన్నారు. శివసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులందరికి ట్యాబ్, మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, అందుకు జిల్లా ఆరోగ్య కేంద్రాలన్నింటిని అనుసంధానిస్తామని తెలిపారు. రైతులకు తగినన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.