సాక్షి, ముంబై: అధికారంలో ఉంటూ మిత్రపక్షంపై విమర్శలు చేయడం మానుకోవాలని బీజేపీ ప్రదేశ్ నూతన అధ్యక్షుడు రావ్‌సాహెబ్ దానవే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు హితవు పలికారు. ఓ మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో బీజేపీ నాయకుడు కొనసాగడం శివసేనకు కడుపు మంటగా ఉందని చురకలంటించారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ తరుచూ ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పించడం ప్రజలకు నచ్చదన్నారు.
ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సేనను పరోక్షంగా హెచ్చరించారు. తమకు తగినంత సంఖ్యా బలం లేదని, అధికారం లేకుంటే శివసేన నాయకులకు మనసు స్థిరంగా ఉండదని, దీని కారణంగానే ఇరుపార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. ఇకనైన బీజేపీపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
అన్ని శాఖలు ప్రధానమైనవే
ఇరుపార్టీల ఓటర్లు ఒక్కటేనని, అధికారం కోసం ఇతర పార్టీల మద్దతు తీసుకుంటే వారి మనోభావాలు దెబ్బ తీసినట్లవుతుందని అన్నారు. బీజేపీ ప్రతిపాదనలు శివసేన వ్యతిరేకించడంవల్ల రెండు పార్టీల్లో సంయమనం, ఐక్యత కొరవడిందనే భావన ప్రజల్లో నాటుకుపోతుందన్నారు. ప్రాధాన్యత లేని శాఖలు తమకు అంటగట్టారని శివసేన ఆసంతృప్తి వ్యక్తం చేయడంపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో అన్ని శాఖలకు ప్రాధాన్యత ఉంటుందని, తప్పుగా భావించడం సరి కాదన్నారు. దానవేను ప్రదేశ్ అధ్యక్షునిగా నియమించడంతో మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆహార, సార్వజనిక పంపిణీ, వినయోగదారుల వ్యవహారాల శాఖకు సహాయ మంత్రిగా ఉన్నారు.
శివసేనకు కడుపు మంట
Published Fri, Mar 6 2015 10:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement