ఢిల్లీలో ఆప్ విజయంపై ఉద్ధవ్ వ్యాఖ్య | AAP win in Delhi a tsunami and defeat for Modi: Shiv Sena chief Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఆప్ విజయంపై ఉద్ధవ్ వ్యాఖ్య

Published Tue, Feb 10 2015 10:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఢిల్లీలో ఆప్ విజయంపై ఉద్ధవ్ వ్యాఖ్య - Sakshi

ఢిల్లీలో ఆప్ విజయంపై ఉద్ధవ్ వ్యాఖ్య

సాక్షి, ముంబై: ఢిల్లీలో బీజేపీ పరాజయానికి కిరణ్ బేడీ కాకుండా మోదీయే కారణమన్న అన్నా హజారే వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పరుషంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘లాటేపేక్షా సునామి మోటీ అస్‌తే’ (అలల కంటే సునామి ప్రభావం అధికంగా ఉంటుంది) అని ఢిల్లీ ప్రజలు నిరూపించారంటూ మోదీని ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలు నరేంద్ర మోదీకి పరాజయం అని పేర్కొనడం తప్పు కాదన్నారు.

దేశమంతా మోదీ అలలు ఊపేస్తున్నాయన్న చర్చ జరిగిందని, కానీ ఢిల్లీ ప్రజలు అలల కన్నా సునామీ గొప్పదని నిరూపించారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షలు అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్ధవ్ ఠాక్రే ఫోన్‌లో అభినందించారు. ఢిల్లీలోని ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లు, ఆశలకు లొంగకుండా కావల్సిన వారికే పట్టంకట్టారని బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న భావన శివసేన కార్యకర్తల్లో నెలకొంది.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా 18 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.

ప్రమాణ స్వీకారోత్సవాలకు వెళ్తాను..!
ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందితే తప్పకుండా వెళతానని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. తాను కేజ్రీవాల్‌తో మాట్లాడి అభినందించానని చెప్పారు. ఢిల్లీ కోసం పని చేయాలని చెప్పానని, సీఎం పదవి నుంచి రాజీనామా చేసే తప్పిదం మరోసారి చేయకూడదని కూడా సూచించానని తెలిపారు.
 
బీజేపీ ముక్త్ భారత్ యాత్ర ప్రారంభమైంది
ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ముక్త్ భారత్ యాత్ర (బీజేపీ లేని దేశం) ప్రారంభమైందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. బీజేపీ అహంకారానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఓ చెంపపెట్టుగా ఉందన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసే బీజేపీని ప్రజలు తిరస్కరించడం ప్రారంభించారని చెప్పారు. మరోవైపు ఢిల్లీలో ఘనవిజయం సాధించిన ఆప్ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
 
బీజేపీకి ప్రజలు బుద్దిచెప్పారు
తమకు తిరుగులేదన్న అహంకారంతో ముందుకు వెళ్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధిచెప్పారని ఎన్సీపీ నాయకుడు ధనంజయ్ ముండే పేర్కొన్నారు. అధికారంలో ఉన్న రూ. 10 లక్షల సూట్‌పై వంద రూపాయల సామాన్యుని మఫ్లర్ గెలిచిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ధనంజయ్ ముండే విలేకరులతో మాట్లాడారు. లోకసభ ఎన్నికల అనంతరం జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ లభించింది. దీంతో బీజేపీ నాయకులకు అహంకారం, గర్వం పెరిగిపోయింది. దీన్ని గమనించిన సామాన్య ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పారని ఆయన పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement