కిరణ్ బేడీపై హజారే కినుక!
- ఫోన్ చేసినా స్పందించని గాంధేయవాది
- బీజేపీలో చేరడంపై అసంతృప్తిగా ఉన్న అన్నా
న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ తీరుపై ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే అసంతృప్తిగా ఉన్నారా? ఆమెతో మాట్లాడేందుకూ ఇష్టపడలేదా? అవుననే అంటున్నారు అన్నా సన్నిహితులు. ఒకనాటి అన్నా టీమ్ సభ్యురాలైన బేడీ తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్టు వారు చెపుతున్నారు. బేడీ తీరుతో ఆయన మనస్తాపం చెందారని పేర్కొన్నారు.
బీజేపీలో చేరిన రోజు నుంచి కిరణ్‌బేడీ రోజూ ఫోన్ చేస్తున్నా అన్నా స్పందించడం లేదని, ఆదివారం ఉదయం, రాత్రి కూడా ఆమె ఫోన్ చేసినా ఆయన మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదని వెల్లడించారు. శుక్రవారం అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో చేరడానికి ముందు బేడీ తనను సంప్రదించలేదని, ఒక ఏడాదిగా ఆమె తనను కలవలేదని చెప్పిన సంగతి తెలిసిందే. 2011లో అన్నా చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లడాన్ని అన్నా హజారే వ్యతిరేకించారు.
అరవింద్ కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీని ప్రారంభించడాన్ని కూడా అన్నా హజారే వ్యతిరేకించారు. తొలుత వ్యతిరేకించినా.. ఆ తర్వాత కేజ్రీవాల్‌కు తన ఆశీస్సు లు అందించారు. నిబద్ధత కలిగిన ముక్కు సూటి వ్యక్తిగా.. కిరణ్‌బేడీని అన్నా భావిస్తారని అందువల్ల.. ఆమె విషయంలోనూ ఆయన కేజ్రీవాల్ తరహాలోనే స్పందించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.
అన్నాకు చాలా సార్లు ఫోన్ చేశా: బేడీ
హజారేకు తాను చాలా సార్లు ఫోన్ చేశానని, ఆయితే ఆయన మాట్లాడలేదని బేడీ చెప్పారు. తాను ఫోన్ చేసిన సమయంలో ఆయన నిద్రపోతూనోచ లేక విశ్రాంతి తీసుకుంటునో ఉండొచ్చన్నారు. ‘మీరు బీజేపీలో చేరడంపై అన్నా అసంతృప్తితో ఉన్నారా’ అని ఆదివారం విలేకరులు ప్రశ్నించగా స్పందించారు. తాను సోమవారం కూడా అన్నాకు ఫోన్ చేస్తానని, తాను ఈ విషయం చెపితే అన్నా ఎలా స్పందిస్తారో తనకు తెలుసని చెప్పారు.