సాక్షి, న్యూఢిల్లీ: ‘నేను అధికారం కోసం ఉన్నత స్థానానికి ఆశపడి రాజకీయాల్లోకి రాలేదు. నలభై ఏళ్ల కాలంగా నా ఉన్నతికి కారణమైన ఢిల్లీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను’ అని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ సోమవారం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఆలోచనలు పంచుకోవడానికి ప్రారంభించిన ‘ఆన్ ఓపెన్ లెటర్ టు ఫెల్లో ఇండియన్స్’ అనే బ్లాగులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇంత వరకు పలు సందర్భాల్లో నగరానికి సేవ చేశాను. కానీ అది చాలా చిన్న పరిమాణంలో మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఓటింగ్ రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు ఎదురైన ఓటమి నన్ను బాధించడం లేదు. ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వం ఉండాలని మాత్రమే నేను కోరుకున్నాను’ అని తెలిపారు. విధానసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘నేను పరీక్షలో ఫెయిల్ అయ్యా. నా నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. అయితే వ్యక్తిగతంగా నేను ఫెయిల్ కాలేదు. ఇచ్చిన సమయంలో నా పూర్తి శక్తిని, అనుభవాన్ని పూర్తిగా పార్టీకి అందించా.
అయితే ఆ శక్తి సరిపోలేదు.’ అని పేర్కొన్నారు. అధికారం కోసం రాజకీయాల్లో చేరాననే అపవాదు వినడానికి తన తల్లిదండ్రులు బతికి లేరన్నారు. తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాల్లో 67 సీట్లను గెలవగా, బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన కిరణ్ బేడీ కృష్ణా నగర్ నియోజకవర్గం నుంచి న్యాయవాది ఎస్‌కే.బగ్గా చేతిలో 2,277 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో అభివృద్ధి పనులు నిలిచిపోవడంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార తీరును ఆమె విమర్శించారు. టెలివిజన్ అందరికీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో జనసభలను నిషేధించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం చట్టబద్ధంగా, పారదర్శకంగా, నిజాల ఆధారంగా, టెక్నాలజీ ఆధారంగా, నిష్పక్షపాతంగా, గౌరవపూర్వకంగా జరగాలని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీకి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా: కిరణ్ బేడీ
Published Mon, Feb 16 2015 10:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement