సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ ప్రకటన బీజేపీ కార్యకర్తలు, స్థానిక నాయకులకు సంతోషం ఏమీ కలిగించడం లేదు. బీజేపీ కోరితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధమని ఆమె ప్రకటించడం పార్టీలో కలకలం సృష్టించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి ఆమె అప్పుడు అంగీకరించలేదు. గతంలో పార్టీ ఇవ్వజూపిన అవకాశాన్ని తిరస్కరించాను కానీ ఇప్పుడు కోరితే దానిని స్వీకరిస్తానని ఆమె తాజాగా స్పష్టం చేశారు. కిరణ్ బేడీని బీజేపీలో చేర్చుకోవడంపై పార్టీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రత్యక్ష రాకీయాల్లో కి రావాలన్న బేడీ ఆకాంక్ష ఢిల్లీ బీజేపీ నేతలు, కార్యకర్తలకు రుచించడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై బహిరంగంగా ఎవరూ ప్రకటనలు చేయడం లేదు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్ దీనిపై నేరుగా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ విషయం గురించి తనకు తెలియదని, ఇది బీజేపీకి పెద్ద విషయం కాదని, మీడియా దానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.
బేడీని ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలబెడతారన్న ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు దీనిపై నోరువిప్పని ఆమె బుధవారం తన అభీష్టాన్ని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ నిలబెట్టిన హర్షవర్ధన్ లోక్‌సభ ఎన్నికల్లో నె గ్గడంతో ఆయనకు కేంద్రంలో మంత్రిపదవి ఇవ్వవచ్చన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే కిరణ్ బేడీ వైఖరిలో మార్పు వచ్చి ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. కొందరు బీజేపీ నేతలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీలో సభ్యత్వంలో లేకుండానే ఆమె అత్యున్నత పదవిపై ఆశలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభంజనం తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అందరికీ తెలుసు. ఈ తరుణంలో ఆమె రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు.
పరిస్థితులు మా పార్టీకి అనుకూలంగా మారిన తరువాత ఎన్నికల్లో పోటీ చేయడం గొప్ప కాదు’ అని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఒకరు అన్నారు. బేడీ బీజేపీలో చేరడంపై తమకు అభ్యం తరం లేదని, అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకోవడం మాత్రం సరికాదని ఆయన విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ కూడా కిరణ్ బేడీకి ఢిల్లీ సీఎం పదవి కట్టబెట్టడానికి సుముఖంగా లేదని, ఈ పదవి హర్షవర్ధన్‌కే దక్కాలని భావిస్తోందని కొందరు బీజేపీ నేతలు చెప్పారు. మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు కూడా హర్షవర్ధన్‌వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రజల ముందుకు వెళ్లాలని కోరుతున్నారు. హర్షవర్ధన్ నేతృత్వంలో పార్టీ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిందని స్థానిక నాయకుల, కార్యకర్తలు వాదిస్తున్నారు.
కిరణ్ బేడీపై వ్యతిరేకత
Published Thu, May 22 2014 10:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement