మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(ఫైల్ ఫొటో)
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న తరుణంలో జిల్లాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ 4.0 అమల్లోకి రానున్న నేపథ్యంలో నిబంధనల సడలింపుపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను శుక్రవారం నాటికి అందజేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ సమీక్ష అనంతరం మంగళవారం ఉద్ధవ్ ఠాక్రే జిల్లా అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. (మందుబాబులకు గుడ్‌న్యూస్: ఇకపై హోం డెలివరీ!)
ఈ సందర్భంగా గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ నిబంధనలు మరింతగా సడలించినప్పటికీ.. ఇప్పటికపుడు జిల్లా సరిహద్దులు తెరిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో మ్యాన్‌పవర్ తగ్గనున్న నేపథ్యంలో వారి స్థానాన్ని స్థానికులతో భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రుతువు మారుతున్న తరుణంలో నీటి ద్వారా ప్రబలే వ్యాధులను ఆయా జిల్లా వైద్యాధికారులే సమర్థవంతంగా కట్టడి చేయాలని.. అవసరమైతే ప్రైవేటు ప్రాక్టీషినర్ల సహాయం తీసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. ఇక జిల్లా సరిహద్దులు మరికొన్నాళ్లు మూసి ఉంచనున్న నేపథ్యంలో గోవా మోడల్‌ను అనుసరించే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. కాగా పర్యాటకులను ఆహ్వానించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. (లాక్‌డౌన్ : గోవా కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment