న‘గరం’.. కిస్ | Udyana Nagari in kiss of love program | Sakshi
Sakshi News home page

న‘గరం’.. కిస్

Published Wed, Nov 19 2014 3:12 AM | Last Updated on Sun, Sep 2 2018 4:12 PM

న‘గరం’.. కిస్ - Sakshi

న‘గరం’.. కిస్

‘కిస్ ఆఫ్ లవ్’.. పేరుతో ఉద్యాన నగరం చట్టం.. సంప్రదాయం మధ్య జరిగే యుద్ధానికి వేదిక కానుంది. మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకిస్తూ కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ సెగ త్వరలో సిలికాన్ సిటీకి తగలనుంది. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలో బెంగళూరు కూడా వేదిక కానుంది. అయితే హిందూ సంస్కృతి, సంప్రదాయలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే శ్రీరామ సేన, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం అధికంగా ఉన్న ఈ రాష్ర్టంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం కత్తిమీద సాము లాంటిదే. ఈ కార్యక్రమాన్ని చేపడితే కచ్చితంగా అడ్డుకుంటామని ఇప్పటికే ఆ సంస్థలు హెచ్చరించాయి.  బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం చట్ట రీత్యా నేరం కాదు. అయితే అది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. దీంతో తాము చట్ట ప్రకారం నడుచుకోవాలా.. లేక భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలా.. ‘కిస్ ఆఫ్ లవ్’ వారికి సపోర్‌‌ట చేయాలా.. లేక శ్రీరామ సేన, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మద్ధతివ్వాలా..  అర్థం కాక హోం శాఖ తలపట్టుకుంది.
 
చట్టం X సంప్రదాయం

* సిలికాన్ సిటీని తాకిన ముద్దుల సెగ
* 22న ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం!
* నగరంలోని టౌన్‌హాల్ ఎదుట నిర్వహించేందుకు సన్నాహాలు
* అడ్డుకుని తీరుతామంటున్న శ్రీరామసేన, ఆర్‌ఎస్‌ఎస్.. సంస్థలు
* కార్యక్రమానికి సంబంధించిన అనుమతిపై స్పష్టత ఇవ్వని హోం శాఖ

సాక్షి, బెంగళూరు : మోరల్ పోలీసింగ్ (నైతిక పోలీసుగిరి)కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ ఇప్పుడు ఉద్యాననగరిని తాకనుంది. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఇప్పటికే అనేక మంది విమర్శలు, మరెంతో మంది మద్దతుతో సాగిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఉద్యాననగరిలో సైతం నిర్వహించనున్నారు. నగరంలోని కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలతో కలిసి నగరానికి చెందిన హక్కుల కార్యకర్త రచితా తనేజా (23) ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 22న నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక నగరంలోని ప్రముఖ చారిత్రాత్మక కట్టడం ‘టౌన్‌హాల్’ ఎదుట ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రజా హక్కుల కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై నిర్వాహకుల్లో ఒకరైన రచితా తనేజా మాట్లాడుతూ...‘మోరల్ పోలీసింగ్‌కి వ్యతిరేకంగానే కాదు.. మోరల్ పోలిసింగ్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి సానుభూతిని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలచాము. నగరానికి చెందిన దాదాపు 150 మంది యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.’ అని తెలిపారు.
 
ముందుగా ఎంజీ రోడ్ అనుకున్నా....

నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ముందుగా ఎంజీ రోడ్‌లోని రంగోలి మెట్రో ఆర్ట్ సెంటర్ వద్ద నిర్వహించాలని భావించినప్పటికీ అనంతరం నిర్వాహకులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనేక ధర్నాలకు వేదికగా నిలుస్తున్న టౌన్‌హాల్ ఎదుటే నైతిక పోలీస్‌గిరీపై తమ వ్యతిరేకతను తెలియజేయాలని భావించి ‘కిస్ ఆఫ్ లవ్’ వేదికను టౌన్‌హాల్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఇతర నగరాల్లో కార్యక్రమ నిర్వహణ సమయంలో ఏర్పడిన ఇబ్బందులు తిరిగి నగరంలో పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ముందుగానే రాష్ట్ర హోం శాఖ నుంచి అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
అనుమతిపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర హోం శాఖ...
ఇక ఉద్యాననగరిలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరతామని శ్రీరామ సేన, ఆర్‌ఎస్‌ఎస్ తదితర సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో నగరంలో ఈ కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ కార్యక్రమ నిర్వహణకు అనుమతిని ఇవ్వడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విషయంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ మంగళవారమిక్కడ మాట్లాడుతూ...‘చట్ట ప్రకారం, చట్టానికి లోబడి ఎలాంటి కార్యక్రమానికైతే అవకాశం ఉంటుందో వాటికి అనుమతులు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే సంసృతి హద్దులు దాటి చేసే పనులపై మాత్రం పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారు’ అని తెలిపారు.

కాగా బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం చట్ట రీత్యా నేరమేమీ కాదని.. అయితే భారతీయ సంసృతీ సాంప్రదాయాల ప్రకారం మాత్రం ఇది సరికాదని నగరానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటి సందర్భంలో ఈ అంశాన్ని చట్ట పరిధిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా.. లేక భారతీయ సంసృతీ, సంప్రదాయాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటారా అనే  అంశంపై హోం శాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ గందరగోళం నడుమ కార్యక్రమానికి అనుమతి లభించక పోతే ‘కిస్ ఆఫ్ లవ్’ను ఈనెల 29కి వాయిదా వేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement