
హవ్వా.. ఇంటర్ విద్యార్థులకు ఇలాంటి పాఠాలా!
న్యూఢిల్లీ: సమాజంలో హెచ్చుతగ్గుల గురించి మాట్లాడటమనేది సాధారణంగా నాయకులు చేసేపని.. అసమానతలు గుర్తు చేయడంలో వారిని మించినవారే ఉండరు. కానీ, అంతా సమానమే అని చెప్పేది మాత్రం ఒక్క ఉపాధ్యాయుడే. అది పాఠశాలల్లో అయినా, పాఠాల్లో అయినా, తాను ప్రసంగించే విద్యావేదికలపైనైనా అది ఆయన బాధ్యత. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి సమాజం. వారికి ఏం చెబితే అదే జీవితాంతం ఉండిపోతుంది. బాల్యంలో వారి మెదళ్లకు ఏది జొప్పిస్తే అదే ఎక్కుతుంది. కానీ, మహారాష్ట్రలో ఓ పుస్తకంలో విద్యార్థులను తప్పుదోవపట్టించే పాఠం దర్శనమిచ్చింది.
సామాజిక రుగ్మతను మరింత పెద్దది చేసేలా ఆ పాఠంలోని ఓ విడిభాగం కనిపించింది. అదేంటంటే.. క్లాస్ 12తరగతికి చెందిన విద్యార్థుల సమాజ శాస్త్రం బుక్‌లో ‘భారత్‌లోని ముఖ్యమైన సామాజిక సమస్యలు’ అనే అంశంపై ఒక పాఠం ఉంది. అందులో ఇప్పటికీ వరకట్నం సమస్య ఉండటానికి గల కారణాలు ఏమిటో జనాలు విస్తుపోయేలా వివరించారు. ఈ రోజుల్లో ఒకమ్మాయికి అందవికారం, అంగవైకల్యంవంటి సమస్యలు ఉంటే పెళ్లి కష్టమైపోతుందని, దీని వల్ల ఏర్పడే పరిణామాలు కట్నం డిమాండ్‌కు దారి తీస్తాయని, వరకట్నం నిషేధం జరిగినా ఇప్పటికీ ఈ కారణాలతో కట్నం అనే విషయం బాగా పెరిగిపోతోందని చెప్పారు.
అందంగా లేకుంటే అబ్బాయి తరుపు వాళ్లు కట్నం బాగా డిమాండ్ చేస్తారని, దీంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు అవతలివారు అడిగినంత కట్నం ఇచ్చి వరకట్న సమస్యను పెంచిపోషిస్తున్నారని ఆ పాఠంలో చెప్పారు. దీన్ని ఎలా సమర్థించారో అర్థంకాక మేథావులు తలలు పట్టుకుంటున్నారు. పుస్తకం రాసినవాళ్లని, ఆ పాఠం చెబుతున్నవారిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.