దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
నోట్లరద్దు ప్రభుత్వ వైఫల్యమన్న ఆజాద్
► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో చర్చ
న్యూఢిల్లీ: నల్లధనంపై పోరాటం కోసం కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం పూర్తి వైఫల్యమని, దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని రాజ్యసభలో విపక్షాలు విమర్శించాయి. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి నోట్లరద్దును మెచ్చుకున్నారు. కానీ.. దేశంలో అవినీతి, నల్లధనం, ఉగ్రవాదాన్ని ఆపటంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. మోదీ సర్కారు దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది.
2016 సంవత్సరం ప్రజలకు మానసిక ఒత్తిడిని, మాంద్యాన్ని, వెనుకబాటుతనాన్ని, కుంగుబాటును మిగిల్చింది’ అని విమర్శించారు. నోట్లరద్దు అమలుకోసం 135 సర్క్యులర్లు విడుదల చేసినా.. ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం కలిగించేలా మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ‘నవంబర్ 8న మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదేనా రైతు సంక్షేమమంటే?’ అని ఆజాద్ ప్రశ్నించారు. ‘మేం సర్జికల్ దాడులను సమర్థిస్తాం. ప్రభుత్వం మరిన్ని సర్జికల్ దాడులు చేసినా మా మద్దతుంటుంది.
కానీ ఈ దాడుల్లో ఎంతమంది పోయారని ప్రశ్నిస్తే మమ్మల్ని దేశద్రోహులంటున్నారు’ అని తెలిపారు. అటు సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు పలు పక్షాలు కూడా నోట్లరద్దు విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అంతకుముందు న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. యూపీఏ అవినీతినుంచి భారత్ రూపాంతరం చెందుతోందన్నారు.