కశ్మీర్‌లో ఔట్-క్యాంపస్
► ఈ ఏడాదే ప్రారంభం
► కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: భారతదేశపు 20వ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను జమ్మూలో నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తర్వాత కశ్మీర్‌లో కూడా ఐఐఎం ఔట్-క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రతిపాదనకు గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచే 54 మంది విద్యార్థుల సామర్థ్యంతో జమ్మూలోని ఓల్డ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఐఐఎం తాత్కాలిక క్యాంపస్ ప్రారంభం కానుంది. ఇందుకు మొదటి నాలుగు సంవత్సరాలకు గాను రూ. 61.90 కోట్లు వ్యయం కానుంది. అలాగే.. ఎన్‌ఐటి - శ్రీనగర్ క్యాంపస్‌లో మౌలికవసతుల ఆధునీకరణకు రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించినట్లు హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
ఎయిమ్స్ కాలనీల పునరభివృద్ధి...
ఢిల్లీలోని ఎయిమ్స్ కాంప్లెక్స్‌లో భాగంగా 60 ఏళ్ల కిందట నిర్మించిన నివాస కాలనీలను పునరభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ పునరభివృద్ధితో పాటు 30 ఏళ్ల పాటు నిర్వహణ, పర్యవేక్షణకు రూ. 4,441 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
ఇథనాల్ ధర సవరణకు ఆమోదం
స్వేచ్ఛా మార్కెట్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తూ.. పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగించే ఇథనాల్ ధరలను సవరించే కొత్త వ్యవస్థకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఫలితంగా ఇథనాల్ ధర లీటరకు రూ. 3 తగ్గి రూ. 39 కి దిగింది. చెరకు నుంచి తీసే ఇథనాల్ ధరను ఇకపై చెరకు మార్కెట్ ధర, డిమాండ్ - సరఫరా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌ను బిహార్‌లోని మణిహారితో అనుసంధానిస్తూ రూ. 1,955 కోట్లతో హైవే ప్రాజెక్టును చేపట్టేందుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
జమ్మూలో ఐఐఎం...
Published Fri, Oct 14 2016 3:08 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement