పెట్రోల్‌,డీజిల్‌ భారీ ధరలు; తగ్గాలంటే దారిదే! | Union Minister Dharmendra Pradhan On Price Hike of Petrol And Diesel | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌,డీజిల్‌ భారీ ధరలు; తగ్గాలంటే దారిదే!

Published Mon, Apr 2 2018 3:27 PM | Last Updated on Mon, Apr 2 2018 6:47 PM

Union Minister Dharmendra Pradhan On Price Hike of Petrol And Diesel - Sakshi

పెట్రోలియం మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌, పక్కన వైరల్‌ కార్టూన్‌

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం, యావత్‌ దక్షిణాసియాలోనే పెట్రో ఉత్పత్తులపై అధిక పన్నులు వసూలు చేస్తోన్న దేశంగా భారత్‌ వెలిగిపోతుండటం తెలిసిందే. దేశరాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.73.73 కాగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.64.58. అదే మన తెలుగురాష్ట్రాల్లోనైతే ఈ వసూళ్లు తారాస్థాయిలో జరుగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 78 పైమాటే, ఇక విశాఖపట్నంలోనైతే రూ. 79 దాటింది. నెల్లూరు, చిత్తూరు లాంటి జిల్లాల్లోనైతే ఏకంగా లీటర్‌ పెట్రోలును రూ.80కి అమ్ముతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోన్న ధరలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ స్పందించారు.

ఒక్కటే దారి: సోమవారం పార్లమెంట్‌ వాయిదా అనంతరం మంత్రి ప్రధాన్‌ మీడియాతో మాట్లాడుతూ ధరల తగ్గుదలకు ఓ సూచన చేశారు. ‘‘ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్‌ను పలుమార్లు అభ్యర్థించాను.. పెట్రో ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తే, అవి వినియోగదారుడికి అందుబాటు దరల్లో లభించడం ఖాయం’’ అని స్పష్టం చేశారు. ఇంకా.. ‘‘పెట్రోలియం ఉత్పత్తులనేవి అంతర్జాతీయ వస్తువులన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చోటుచేసుకునే ఒడిదుడుకులు దేశీయంగా ప్రభావం చూపుతున్నాయి. వినియోగదారుల పరంగా భారత్‌ సున్నితమైన దేశం. ధరల తగ్గింపునకు మా వంతు ప్రయత్నాలను చేస్తున్నాం..’’ అని మంత్రి అన్నారు.

దేశంలో అన్నిరకాల ఉత్పత్తులకు భిన్నంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం రాజకీయంగా విమర్శలకు దారితీసిన విషయం విదితమే. ఏదైనా ఉత్పత్తిపై జీఎస్టీ విధింపునకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షుడిగా, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండే జీఎస్టీ కౌన్సిల్‌దే తుది నిర్ణయమన్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర ప్రభుత్వం చేతులో ఉన్న ధరల నియంత్రణ అధికారాన్ని ఆయిల్‌ కంపెనీలకు కట్టబెట్టిన తర్వాత.. ఆ సంస్థలు 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించేవి. గతేడాది జూన్‌ నుంచి రోజువారీగా ధరలను సమీక్షించడం ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకింత చొప్పున పెరుగూ తాజాగా నాలుగేళ్ల గరిష్టస్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చేరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement