న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. ఈ విషయంపై తమను కోర్టు సహాయకారిగా నియమించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ చట్టం తమ అంతర్గత వ్యవహారమని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో విదేశీ సంస్థల జోక్యానికి తావులేదని తెలిపింది. సీఏఏపై తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు మానవ హక్కుల కమిషనర్ మైకేల్ బాచెలెట్ జరియా సోమవారం జెనీవాలోని భారత దౌత్యకార్యాలయానికి సమాచారం అందించారని, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ మంగళవారం తెలిపారు. అయితే ‘సీఏఏ అనేది భారత్ అంతర్గత వ్యవహారం. చట్టాలు చేసేందుకు దేశ పార్లమెంటుకు ఉన్న సార్వభౌమ హక్కులకు సంబంధించిన విషయమిది. ఈ విషయాల్లో విదేశీ సంస్థల జోక్యానికి తావే లేదు’ అని అన్నారు.
అంతర్జాతీయ చట్టాలను పరిగణించాల్సింది
పౌరసత్వ సవరణ చట్టం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు, సంప్రదాయాలు, ప్రమాణాలను పరిగణించి ఉండాల్సిందని కాబట్టి ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఐక్యరాజ్య సమతి మానవ హక్కుల హై కమిషనర్ మైకేల్ బాచెలెట్ జెరియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఏఏ విషయాల్లో తాను కోర్టు సహాయకుడిగా వ్యవహరించేందుకు అనుమతించాలని కోరారు. మానవహక్కుల ప్రోత్సాహానికి తగిన సలహా సూచనలు ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంది. ముస్లింలలోని వేర్వేరు తెగల వారిని చట్టం పరిధిలోకి తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించింది. ‘వేల మంది శరణార్థులు, వలసదారులకు ఈ చట్టం మేలు చేకూర్చవచ్చు. ఈ చట్టం లేకపోతే సొంత దేశాల్లో హింస నుంచి రక్షణ దొరకదు సరికదా.. పౌరసత్వం దూరమయ్యే అవకాశముంది. అందుకే సీఏఏ ఉద్దేశం ప్రశంసనీయమైంది’ అని వివరించారు.
అల్లర్లలో గాయపడిన టీనేజర్ మృతి
ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో గాయపడిన అకిబ్(18) ఆస్పత్రిలో కన్నుమూశాడు. తన సోదరి పెళ్లి ఏర్పాట్లలో భాగంగా షాపింగ్‌కు వెళ్లిన ఇతడిపై ఫిబ్రవరి 24వ తేదీన దుండగులు దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన అకిబ్‌ను జీటీబీ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అతడు సోమవారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూశాడని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ఈ అల్లర్లలో 79 ఇళ్లు, 327 దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిæ సిసోడియా చెప్పారు. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో వచ్చే మెసేజీలపై ఫిర్యాదు చేసేందుకు వాట్సప్ నంబర్ 8950000946ను, ఈమెయిల్ ఐడీ dvscommittee@delhigov.in ను అందుబాటులోకి తెచ్చారు. అల్లర్ల ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మత పెద్దలతో గురువారం సమావేశం జరపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment