ప్రధాని ఇంటి వద్ద సమైక్య నిరసన | United protests before Prime minister's House | Sakshi
Sakshi News home page

ప్రధాని ఇంటి వద్ద సమైక్య నిరసన

Published Fri, Oct 4 2013 2:12 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

ప్రధాని ఇంటి వద్ద సమైక్య నిరసన - Sakshi

ప్రధాని ఇంటి వద్ద సమైక్య నిరసన

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ సమావేశానికి కొద్ది నిమిషాలు ముందు ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన నోట్‌ కేబినెట్‌ ముందుకు వస్తుందన్న సమాచారంతో అత్యంత నాటకీయంగా అక్కడికి చేరుకున్న సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్థులు ప్రధాని నివాసం వైపుగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ సుమారు వంద మంది విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రధాని నివాసంలోకి చొచ్చుకె ళ్లే ప్రయత్నం చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఉండే ప్రధాని నివాసం పరిసరాల్లోకి ఒక్కసారిగా అంతమంది విద్యార్థులు చొచ్చుకు రావడంతో తొలుత అక్కడి సెకూర్యిటీ సిబ్బంది కలవరపాటుకు గురయ్యారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకొని స్థానిక చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సీమాంధ్రలోని వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం 5.30 నిమిషాలకు కేబినెట్‌ భేటీ జరుగుతుందనగా 15 నిమిషాల ముందు ప్రధాని నివాసం వద్దకు విద్యార్థులంతా గుంపులు గుంపులుగా చేరుకున్నారు. స్థానిక రేస్‌కోర్‌‌స మెట్రో స్టేషన్‌ వైపు నుంచి విద్యార్థులు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఒక్కసారిగా ప్రధాని నివాసం ప్రధాన ద్వారంవైపు ప్రదర్శనగా వెళ్లారు. నివాసం ముందున్న బారికేడ్లను దాటేందుకు విశ్వప్రయత్నం చేశారు. కొందరు విద్యార్థులైతే ఏకంగా సెక్యూరిటీ వలయాన్ని దాటి, బారికేడ్లను ఎక్కి ప్రధాని నివాసం వైపు ప్లకార్డులు చూపారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేస్తూ, అక్కడే రోడ్డుపై బైఠాయించారు.

మరికొందరు విద్యార్థులు తమ చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది కాళ్లు పట్టుకొని కొందరు విద్యార్థులు తమను ఆపవద్దని వేడుకున్నారు. విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించడంతో ప్రధాని నివాసానికి వస్తున్న కొందరు కేంద్ర మంత్రుల వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చికుక్కున్నాయి. సుమారు ఇరవై నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులు విద్యార్థుల ప్రదర్శనను అడ్డుకొని, అరెస్‌‌ట చేసి స్థానిక చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మొత్తంగా విద్యార్థుల ఆందోళనతో ప్రధాని నివాసం వద్ద 45 నిమిషాల పాటు ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చేసిన విద్యార్థులను రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పోలీసులు విడుదల చేశారు. కాంగ్రెస్‌కు సమాధే: విద్యార్థి సంఘం నేతలు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సీమాంధ్ర భవిష్యత్‌ను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి తాకట్టుపెట్టారని విద్యార్థి సంఘం నేతలు కృష్ణ యాదవ్‌, ఇతర నేతలు విమర్శించారు. కేబినెట్‌ ముందుకు టినోట్‌ వస్తుందని తెలిసినా కేంద్ర మంత్రులు పదవులు పట్టుకొని వేలాడారని ధ్వజమెత్తారు. కేబినెట్‌ నోట్‌ ఆమోదం పొందితే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్‌ అంతా హైదరాబాద్‌తో ముడిపడి ఉందని, అలాంటి హైదరాబాద్‌ను దూరం చేస్తే సీమాంధ్ర విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా పదవులకు రాజీనామాలు చేసి విభజనను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement