- నేటి నుంచి అలహాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ
- పాల్గొననున్న మోదీ,అమిత్ షా, కేంద్ర మంత్రులు
అలహాబాద్: కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశమవుతోంది. రెండ్రోజులపాటు జరిగే ఈ సమావేశాలు ఆదివారం అలహాబాద్‌లో ప్రారంభమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలతోపాటు సీనియర్ కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఎంపీలు తదితరులు పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జరిగే యూపీ శాసనసభ ఎన్నికల కోసం జెండా ఖరారుచేసే అవకాశముంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ దీన్ని యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శంఖారావ సభగా అభివర్ణించారు.
సమావేశాల్లో పలు అంశాలపై చర్చ జరుగుతుందని, అయితే యూపీ ఎన్నికలపైనే ముఖ్యంగా దృష్టి కేంద్రీకరిస్తారని పార్టీ ఉపాధ్యక్షుడు, యూపీ ఇన్‌చార్జి ఓమ్ మాథుర్ చెప్పారు. నగరంలోని అన్ని దారులు కాషాయ రంగును పులుముకున్నాయి. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ‘మిషన్ 265 ప్లస్’ లక్ష్యంతో పనిచేయాలని అమిత్ షా చెప్పిన మాటను, సుల్తాన్‌పూర్ ఎంపీ వరుణ్‌గాంధీని యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్‌తోనూ పలు పోస్టర్లు వెలిశాయి. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యకరంగా 71 స్థానాలు కైవసం చేసుకుంది.
జాతీయ కార్యవర్గంలోకి హిమంత
కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతలకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో పెద్దపీట వేశారు. అస్సాం ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన హిమంత బిస్వా శర్మ, ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ, ఒడిశా మాజీ సీఎం గిరధర్ గమాంగ్, కేంద్ర మాజీ మంత్రి కేపీ సింగ్ దేవ్ తదితరులకు చోటు కల్పించారు.
యూపీ పర్యాటకానికి రూ.300 కోట్లు
యూపీ పర్యాటక రంగ అభివృద్ధి కోసం రామాయణ, క్రిష్ణ, బౌద్ధ సర్క్యూట్లలోని ప్రాజెక్టులకు రూ.300 పైచిలుకు నిధులిచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
యూపీ పీఠమే లక్ష్యంగా...
Published Sun, Jun 12 2016 12:50 AM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM
Advertisement